కొనసాగుతున్న విధ్వంసం

2 Apr, 2020 05:04 IST|Sakshi
ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉన్న ఓర్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై నిలిచిపోయిన విమానాలు

పారిస్‌: కరోనా మృత్యుపాశానికి బలవుతున్న వారి సంఖ్య బుధవారం నాటికి మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 186 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య ఏకంగా 43,082కు చేరుకోగా, వైరస్‌ సోకిన వారి సంఖ్య 8.65 లక్షలు దాటిపోయింది. అయితే సుమారు 1.72 లక్షల మంది చికిత్స తరువాత వ్యాధి నయమై ఇళ్లకు చేరుకోవడం ఒకింత సాంత్వన కలిగించే అంశం. గత ఏడాది చైనాలో తొలిసారి గుర్తించిన ఈ వైరస్‌ ఇప్పుడు యూరప్, అమెరికాల్లో తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.

అమెరికాలో  4వేల మంది..
న్యూయార్క్‌: అమెరికాలో కోవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య నాలుగు వేలు దాటిపోయింది. ఈ మరణాల పరంపర ఇప్పుడిప్పుడే ఆగేది కాదని, అమెరికాలోనే సుమారు లక్ష నుంచి రెండు లక్షల మంది ప్రాణాలను బలిగొనే అవకాశముందని ఆ దేశంలోనే అత్యున్నత ఆరోగ్య నిపుణుడు హెచ్చరించడం ఆందోళన కలిగించే అంశమైంది. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి సుమారు 1,90,000 మంది వైరస్‌ బారిన పడగా, నాలుగు వేల మంది మరణించారని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ కరోనా వైరస్‌ రిసోర్స్‌ సెంటర్‌ చెబుతోంది. 2001నాటి అల్‌ఖైదా దాడుల్లో మరణించిన వారు మూడు వేల వరకూ ఉంటే కరోనా మృతుల సంఖ్య దీనికంటే ఎక్కువవడం గమనార్హం.

అంతేకాదు.. కరోనావైరస్‌ పుట్టిల్లుగా చెప్పుకునే చైనాలో ఇప్పటివరకూ దాదాపు 3,300 మంది మాత్రమే మరణించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా... అమెరికా రానున్న రెండు వారాల్లో అత్యంత కఠినమైన, వేదన భరితమైన పరిస్థితులను ఎదుర్కోనుందని, ప్రజలు ఈ కష్టాలన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ట్రంప్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘రెండు వారాల కష్టకాలం ముందు ఉంది. ఆ తరువాత, నిపుణులు అంచనా వేస్తున్నట్లు, నేను.. మనలో చాలామంది ఆలోచిస్తున్నట్లుగా పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని ఆశిస్తున్నాం. అయితే ఈ రెండు వారాలు మాత్రం చాలా చాలా బాధకరంగా ఉండబోతున్నాయి’’అని స్పష్టం చేశారు.
 
ఇరాన్‌లో మృతులు 3036 మంది!
మధ్యప్రాచ్య దేశం ఇరాన్‌లో గత 24 గంటల్లో సుమారు 138 మంది కరోనా కారణంగా మరణించారని, కొత్తగా 2,987 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి కిమానౌష్‌ జహాన్‌పౌర్‌ తెలిపారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,75,93కి చేరుకోగా 3,036 మంది మరణించారని చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు