గబ్బిలాన్ని కరోనా ఏం చేయలేదా?

16 Apr, 2020 04:39 IST|Sakshi

సింగపూర్‌ సిటీ: నిఫా, ఎబోలా వైరస్‌ల తరహాలో కరోనా వైరస్‌ సైతం గబ్బిలాల నుంచే సోకిందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మొదట కరోనా వైరస్‌ను గుర్తించిన చైనాలోని వుహాన్‌లోని కరోనా పేషెంట్ల నుంచి చైనా శాస్త్రవేత్తలు శాంపిల్స్‌ సేకరించారు. వాటిని ఇతర వైరస్‌ల జన్యు క్రమాలతో పోల్చారు. చైనాలోని ఒక తరహా గబ్బిలం(హార్స్‌షూ)లో లభించిన వైరస్‌ జన్యుక్రమంతో ఈ శాంపిల్‌లోని వైరస్‌ జన్యుక్రమం 96% సరిపోలింది. అయితే, ఈ వైరస్‌ నేరుగా గబ్బిలం నుంచి మనిషికి సోకలేదని, మధ్యలో మరో వాహకం ఉండే చాన్సుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సార్స్‌ వ్యాధికి కారణమైన కరోనా వైరస్‌ గబ్బిలం నుంచి ముంగిస జాతికి చెందిన వాహకం ద్వారా మనుషులకు సోకినట్లు, అలాగే, మెర్స్‌ వ్యాధి గబ్బిలం నుంచి ఒంటె ద్వారా మనుషులకు సోకినట్లు నిర్ధారణ అయిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. గబ్బిలాల్లో పెద్ద సంఖ్యలో వివిధ రకాలైన వైరస్‌లు ఉంటాయి. మనుషులకు సోకే ముప్పున్న దాదాపు 130 రకాల వైరస్‌లను గబ్బిలాల్లో గుర్తించారు. మల, మూత్రాలు, ఉమ్మి ద్వారా గబ్బిలాలు వైరస్‌ను వ్యాప్తి చేస్తాయి. ఇన్ని వైరస్‌లకు ఆవాసమైన గబ్బిలాలపై ఆ వైరస్‌ ప్రభావం ఎందుకు పడదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

దీనికి సమాధానాన్ని సింగపూర్‌లోని డ్యూక్‌ ఎన్‌యూఎస్‌ మెడికల్‌ స్కూల్‌లో గబ్బిలాల్లోని వైరస్‌లపై పరిశోధన చేస్తున్న లిన్ఫా వాంగ్‌ వివరించారు. ‘గబ్బిలం ఎగరగల క్షీరద జాతి. ఎగిరేటపుడు వాటి శరీర ఉష్ణోగ్రత 100 ఫారన్‌హీట్‌ వరకు వెళ్తుంది. గుండె నిమిషానికి 1000 కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మిగతా క్షీరదాలైతే చనిపోతాయి. ఎగిరే సమయంలో తలెత్తే ఈ ఒత్తిడిని తట్టుకునేలా ఒక ప్రత్యేక వ్యాధి నిరోధక వ్యవస్థను గబ్బిలాలు సమకూర్చుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా అవి తమ శరీరంపై వైరస్‌ల ప్రభావాన్ని చంపేసే ప్రత్యేక కణాలను తయారుచేసుకుంటాయి. అలా, వాటి శరీరాలు వైరస్‌ల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొని, జబ్బు పడకుండా ఉంటాయి’అని వాంగ్‌ వివరించారు. ఇలాంటి వ్యవస్థ మనుషులు సహా ఇతర క్షీరదాల్లో లేదని చెప్పారు.

మరిన్ని వార్తలు