కేసులు 5 లక్షలు.. మృతులు 22 వేలు

27 Mar, 2020 05:05 IST|Sakshi
కరోనా భయంతో సభ్యులు లేక ఖాళీగా కనిపిస్తున్న స్పెయిన్‌ పార్లమెంట్‌. లాక్‌డౌన్‌ పొడిగింపు బిల్లుకు సభ్యులు ఆన్‌లైన్‌ ద్వారా ఆమోదం తెలిపారు.

స్పెయిన్‌లో ఒక్క రోజే 655 మంది మృతి

వాషింగ్టన్‌/జెనీవా/మాడ్రిడ్‌: ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 22 వేలు దాటిపోయింది. చైనా కరోనాని అసాధారణ స్థాయిలో నియంత్రించినప్పటికీ అమెరికా, యూరప్‌ దేశాల్లో కరోనా విజృంభణ ఇంకా ఆగలేదు. అమెరికా, యూరప్‌ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పటికీ ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోతూ ఉండడంతో సౌకర్యాల్ని ఏర్పాటు చేయలేక బెంబేలెత్తిపోతున్నాయి.  

అగ్రరాజ్యంలో వెయ్యి దాటిన మృతులు  
అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించిన 2.2 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీకి అమెరికా సెనేట్‌ ఆమోద ముద్ర వేసింది. వైరస్‌ కారణంగా రాష్ట్రాల్లో విధించిన ఆంక్షలతో అమెరికాలో 33 లక్షల మంది ఉపాధి కోల్పోయారు.  ఇన్ని లక్షల మంది ఉపాధి కోల్పోయి ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడడం దేశంలో ఇదే తొలిసారి. ఆ దేశంలో 75 వేలకు పైగా కేసులు నమోదైతే, 1,080 మంది ప్రాణాలు కోల్పోయారు.  అమెరికా లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకోకపోతే వైరస్‌ను అదుపు చేయడం కష్టమని  వివిధ రాష్ట్రాల గవర్నర్లు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు.  

నెం.1 ప్రజా శత్రువు: కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతోందని, ప్రపంచ దేశాల నాయకులు ఈ వైరస్‌పై పోరాడడంలో మొదట్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి విలువైన సమయాన్ని వృథా చేశారని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రాస్‌ అధానమ్‌ ఘెబ్రెయేసస్‌ అన్నారు. ఒకట్రెండు నెలలకి ముందే ఈ స్థాయిలో ప్రపంచ దేశాలు స్పందించి ఉండాల్సిందన్నారు.

మేమూ సాయం చేస్తాం : భారత్‌కు చైనా ఆఫర్‌
కరోనాను అరికట్టడంలో తమ దేశానికి భారత్‌ అందించిన సాయానికి చైనా ధన్యవాదాలు తెలిపింది. ఇప్పడు చైనా కోలుకోవడంతో భారత్‌కు సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. భారత్‌లో చైనా రాయబార కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది.  

ఊళ్ల సరిహద్దుల్ని మూసేశారు : ఇరాన్‌
ఇరాన్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ఊరికి, ఊరికి మధ్య సరిహద్దుల్ని కూడా మూసేశారు. గురువారం ఒక్క రోజే 157 మరణాలు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 2,234కి చేరుకుంది. ఇక కేసుల సంఖ్య 30 వేలకి చేరుకోవడంతో ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.  

పోప్‌ నివాసంలో మతాధికారికి వైరస్‌: ఇటలీ  
 వాటికన్‌ సిటీలో పోప్‌ నివాసం ఉండే భవనంలో ఉన్న సెయింట్‌ మార్థా గెస్ట్‌ హౌస్‌లో ఉండే మత ప్రబోధకుడికి కరోనా సోకడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే పోప్‌ ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని వాటికన్‌ వర్గాలు వెల్లడించాయి. గత నెలలో జలుబు రావడంతో 83 ఏళ్ల వయసున్న పోప్‌ విడిగానే ఉంటున్నారు.  

ఆసుపత్రులుగా మారుతున్న హోటళ్లు: స్పెయిన్‌
కరోనా వైరస్‌తో స్పెయిన్‌లో ఒక్క రోజులో 655 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 4,089కి చేరుకుంది. ఇక కేసుల సంఖ్య 56 వేలు దాటి పోయింది. ఆరోగ్య కేంద్రాలు సరిపడినన్ని లేకపోవడంతో ప్రభుత్వం హోటళ్లన్నింటినీ తాత్కాలికంగా ఆసుపత్రులుగా మార్చి రోగులకు సేవలు అందిస్తోంది.  

ఇల్లుదాటి వస్తే హత్యాయత్నం కేసులు: దక్షిణాఫ్రికా
ఇల్లు దాటి బయటకు వస్తే హత్యాయత్నం కేసులు పెడతామని తమ పౌరులను దక్షిణాఫ్రికా ప్రభుత్వం హెచ్చరించింది. ఇద్దరు వ్యక్తులపై అభియోగాలు నమోదు చేసింది కూడా. భారీగా జరిమానా, జైలు శిక్ష విధించనుంది.  

3,700 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం కావాలి: పాక్‌
కరోనా కేసులు 1100 దాటిపోవడంతో పాకిస్తాన్‌ 3,700 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించాలని ఐఎంఎఫ్‌ని కోరింది. ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకునే శక్తి తమకు లేదంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా