వూహాన్‌లో కోవిడ్‌ రోగులు నిల్‌

27 Apr, 2020 04:44 IST|Sakshi
ఆదివారం చైనా వాణిజ్య రాజధాని షాంఘై నగరంలోని ఓ బార్‌లో కిక్కిరిసిన జనం

నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడి  

బీజింగ్‌/వూహాన్‌/వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ పుట్టిన చైనాలో వూహాన్‌ మరో విజయాన్ని సాధించింది. కోవిడ్‌–19తో చికిత్స పొందుతున్న రోగులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆస్పతుల్లో లేరు. వ్యాధి నుంచి కోలుకొన్న 11 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయడంతో రోగుల సంఖ్య జీరోకి వచ్చింది. గత డిసెంబర్‌ చివరి వారంలో వైరస్‌ బయటపడిన తర్వాత తొలిసారిగా కరోనా రోగుల విషయంలో జీరో అన్నది సాధించామని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. 76 రోజుల పాటు లాక్‌డౌన్‌లో ఉన్న వూహాన్‌లో ఏప్రిల్‌ 8న లాక్‌డౌన్‌ ఎత్తేశారు. అయితే అప్పటికే చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత కూడా అడపా దడపా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ‘‘వూహాన్‌లో కోవిడ్‌ వ్యాధికి చికిత్స పొందుతున్న చివరి రోగిని శుక్రవారం డిశ్చార్జ్‌ చేశాము. ప్రస్తుతం వూహాన్‌లో కరోనా రోగి ఒక్కడు కూడా లేరు’’అని హెల్త్‌ కమిషన్‌ అధికార ప్రతినిధి మి ఫెంగ్‌ చెప్పారు. శనివారం కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని తెలిపారు. వూహాన్‌ రాజధానిగా ఉన్న హుబాయ్‌ ప్రావిన్స్‌లో 68,128 కరోనా కేసులు నమోదైతే అందులో వూహాన్‌లోనే 50,333 కేసులు నమోదయ్యాయి.  

మీడియా ముందుకు రాని ట్రంప్‌
కరోనా రోగులకి క్రిమి సంహారక రసాయనాలు తాగించాలని, వారి ఊపిరితిత్తుల్లోకి యూవీ కిరణాలు జొప్పించాలంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం మీడియా సమావేశంలో పాల్గొనలేదు. మీడియా సమావేశాలతో ఉపయోగం లేదని, విలువైన సమయాన్ని వెచ్చించే స్థాయిలో అవి లేవని ట్వీట్‌ చేశారు. ‘ఒక వర్గం మీడియా అన్నీ వ్యతిరేక ప్రశ్నలే వేస్తుంది. వాస్తవాల్ని దాచిపెట్టి వాళ్లకి ఇష్టం వచ్చినట్టుగా రాస్తుంది. దీనివల్ల ఏం ప్రయోజనం, మీడియాకి రేటింగ్స్‌ వస్తున్నాయి. అమెరికా ప్రజలు తప్పుడు వార్తల్ని వింటున్నారు. ఇలాంటి వాటి కోసం ఈ సంక్షోభ సమయంలో విలువైన సమయాన్ని కేటాయించలేను’అని ట్రంప్‌ పేర్కొన్నారు. క్రిమిసంహారకాలపై వ్యాఖ్యలతో నవ్వులపాలైన ట్రంప్‌ కొన్నాళ్లు మీడియాకి దూరంగా ఉండడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం.

24 గంటల్లో 2,494 మంది మృతి
అమెరికాలో కోవిడ్‌ మృత్యుఘోష వినిపిస్తూనే ఉంది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ వివరాల ప్రకారం 24 గంటల్లో 2,494 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులు గణనీయంగా తగ్గు ముఖం పట్టాయి. గత మూడు వారాల్లో అత్యంత తక్కువగా 24 గంటల్లో 1,258 మరణాలు నమోదయ్యాయి. మరో వైపు స్పెయిన్‌లో గత అయిదు వారాల్లోనే అత్యంత తక్కువగా మరణాలు నమోదయ్యాయి. ఆదివారం 288 మంది మరణించారు.

మరిన్ని వార్తలు