వైట్‌హౌస్‌కి కరోనా దడ

10 May, 2020 03:20 IST|Sakshi
కేటీ మిల్లర్

ఉపాధ్యక్షుడి ప్రెస్‌ సెక్రటరీకి పాజిటివ్‌

ఇవాంకా ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలికీ సోకిన వైరస్‌

వాషింగ్టన్‌/బీజింగ్‌: అమెరికా శ్వేతసౌధాన్ని కరోనా వైరస్‌ భయపెడుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి కరోనా సోకిన మర్నాడే మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రెస్‌ సెక్రటరీ కేటీ మిల్లర్, అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా సోకింది. దీంతో వైట్‌హౌస్‌లో కేసుల సంఖ్య మూడుకి చేరుకుంది.  కరోనా పరీక్షల్లో వాళ్లిద్దరికీ పాజిటివ్‌గా తేలింది.

ఇటీవల కేటీ మిల్లర్‌ పెన్స్‌ను కలుకున్నారు కానీ ట్రంప్‌ని నేరుగా కలుసుకోలేదు. అయితే కేటీ మిల్లర్‌ ట్రంప్‌ సలహాదారుల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే స్టీఫెన్‌ మిల్లర్‌ భార్య కావడంతో వైట్‌ హౌస్‌లో ఆందోళన నెలకొంది. వైట్‌హౌస్‌లో రాకపోకలపై మరింత పకడ్బందీ చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే స్టీఫెన్‌ మిల్లర్‌కి పరీక్షలు చేయించారా? ఆయన వైట్‌ హౌస్‌కు తరచూ వస్తున్నారా అన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు.


కేటీ మిల్లర్‌కి గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వస్తే, ఆ మర్నాడు నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ ఒక్క రోజులోనే పరీక్షల్లో అంత వ్యత్యాసం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అందుకే కరోనా వైరస్‌కి ఎవరూ భయపడాల్సిన పని లేదని ఆయన తేల్చేశారు. ట్రంప్‌ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి కరోనా సోకడంతో వైట్‌హౌస్‌లో పనిచేసే సిబ్బంది అందరికీ రొటీన్‌గా చేసే పరీక్షల్లో కేటీకి పాజిటివ్‌ వచ్చింది.  

ఇవాంకా కొన్ని వారాలుగా కలవలేదు
అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలికి కూడా కరోనా సోకినట్టుగా సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. ఇవాంకా తన పనులన్నీ వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా నిర్వహిస్తూ ఉండడంతో ఆమెను కొన్ని వారాలుగా కలుసుకోలేదు. దీనివల్ల  ఇవాంకాకు వచ్చిన ఇబ్బందిలేదు. ఇవాంక ఆమె భర్త ఖుష్నెర్‌ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే వారిద్దరికీ నెగిటివ్‌ వచ్చింది.

ఎలాంటి సవాలైనా చైనా ఎదుర్కొంటుంది : జిన్‌ పింగ్‌
చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వెనకేసుకొచ్చారు. సీపీసీ నాయకత్వం, దేశంలోని సోషలిస్టు పొలిటికల్‌ వ్యవస్థ ఎలాంటి సంక్షోభాన్నయినా ఎదుర్కోగలదని కోవిడ్‌పై పోరాటంతో మరోసారి రుజువైందని అన్నారు. కరోనా వైరస్‌ బట్టబయలైన తొలిరోజుల్లో చైనా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జిన్‌పింగ్‌ మాట్లాడారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు