కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన

7 Jul, 2020 15:44 IST|Sakshi

ఫేజ్ 3  ప్రయోగాలకు సిద్ధం: సినోవాక్

ఈ నెలలోనే బ్రెజిల్ లో  ట్రయల్స్

ఈ ఏడాది చివరి నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌

బీజింగ్: చైనానుంచే కరోనా పుట్టిందన్న ఆందోళన మధ్య చైనా సంస్థ సినోవాక్ కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ పై ఫేజ్3 దశ ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు సినోవాక్ తాజాగా వెల్లడించింది. ఫేజ్ 1, ఫేజ్ 2 దశలను విజయవంతంగా పూర్తి చేసుకొని  మానవులపై జరుపుతున్న పరీక్షలకు సంబంధించి  చివరి దశను త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు తెలిపింది.  (కరోనా : శుభవార్త చెప్పిన మైలాన్‌)

బ్రెజిల్ వ్యాక్సిన్ తయారీదారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బుటాంటన్‌తో కలిసి చేయబోయే ఈ అధ్యయనంలో, కోవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రులలో పనిచేస్తున్న దాదాపు 9,000 మంది ఆరోగ్య నిపుణులను నియమించు కుంటామని వెల్లడించింది. బ్రెజిల్ లో నిర్వహించే ట్రయల్స్ కు వాలంటీర్ల ఎంపిక ఈ నెలలోనే  ఉంటుందని వెల్లడించింది. ఈ ట్రయల్స్ కు సంబంధించి గత వారమే చైనా కంపెనీకి బ్రెజిల్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ ఏడాది  జనవరి చివరిలో టీకా తయారీ  పనులను సినోవాక్ ప్రారంభించింది. సంవత్సరానికి 100 మిలియన్ డోస్ల ఉత్పత్తి సామర్ధ్యంతో కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌ను సిద్ధం చేస్తోంది. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి సిద్ధంగా ఉంటుందని, సినోవాక్ భావిస్తోంది.

వాక్సిన్ తయారీలో చివరి దశకు చేరుకున్నమూడు కంపెనీలలో ఒకటిగా సినోవాక్ నిలిచింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెన్కా సంయుక్తంగా తీసుకొస్తున్న వాక్సిన్ ప్రస్తుతం ఫేజ్ 3 లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సినోఫాం (చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్) కు చెందిన వ్యాక్సిన్ కూడా  ఫేజ్ 3 పరీక్షల దశలో ఉంది. 

గాలినుండి కూడా వైరస్ వ్యాపిస్తుందన్న అంచనాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలలో గాలిద్వారా మహమ్మారి విస్తరిసుందన్న అంచనాలతో వీలైనంత త్వరగా టీకా తీసుకురావాలని ఔషధ కంపెనీలు, శాస్త్రవేత్తలపై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రస్తుతం భారతదేశం, బ్రిటన్, చైనా, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా వ్యాక్సిన్లు వివిధ దశలలో ఉన్నాయి.  కాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 11 మిలియన్లను దాటగా, మరణాల సంఖ్య 540,000 దాటింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు