ఆవులు మాట్లాడుకుంటాయ్‌!

20 Jan, 2020 22:44 IST|Sakshi

సిడ్నీ : ఆవులు మాట్లాడుకోవడమేంటి? ‘అంబా’అని అరవడం తప్ప వాటికింకేమి మాటలొస్తాయ్‌? అంటారా..! నిజమే.. కానీ ‘అంబా’అనే ఆ ఒక్క పదంలోనే అవి తమలోని విరుద్ధ భావాలను పరస్పరం తెలియజేసుకుంటాయని తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ రీసెర్చర్ల బృందం ఈ పరిశోధన నిర్వహించింది. వీరు ఆవు అరుపులపై అధ్యయనం చేశారు. వాటి అరుపులను తర్జుమా చేయడానికి గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ వంటి ఓ పరికరాన్ని తయారుచేసి ఉపయోగించారు. దీని ద్వారా ఆవుల ‘అంబా’అరుపులో భావోద్వేగాన్ని బట్టి స్వరం తీవ్రతలో తేడాలుంటాయని గుర్తించారు.

కోపం, బాధ, భయం, సంతోషం.. ఇలాంటి వివిధ రకాల భావాలను వ్యక్తం చేసేటపుడు, తోటి ఆవులను పిలిచేటప్పుడు వాటి అరుపుల్లో తేడాలుంటాయని పరిశోధనలో పాలుపంచుకున్న అలెగ్జాండ్రా గ్రీన్‌ తెలిపారు. ఆవుల ‘అంబా’ అరుపులోని ఈ తేడాలు వాటి జీవితాంతం కొనసాగుతాయని పేర్కొన్నారు. 333 ఆవుల అరుపులను రికార్డ్‌ చేసి, అనలైజ్‌ చేయగా ఈ విషయం తెలిసిందని వెల్లడించారు. ఒక మందలో ఏ ఆవు అరిచిందో దాన్ని చూడకుండా కేవలం వినడం ద్వారా మిగిలినవి గుర్తుపట్టగలవని, ప్రతి ఆవుకూ భిన్న వాయిస్‌ ఉంటుందని పరిశోధనలో కనుగొన్నట్లు గ్రీన్‌ వివరించారు.

మరిన్ని వార్తలు