బాధితుల కళ్లే.. పట్టిస్తాయి!

28 Dec, 2013 03:44 IST|Sakshi
బాధితుల కళ్లే.. పట్టిస్తాయి!

డిజిటల్ ఫొటోగ్రఫీలో కొత్త టెక్నిక్ ఆవిష్కరణ

 లండన్: మహిళలు, పిల్లలు, నిస్సహాయులైన ఇతరులపై దాడి చేసి నేరాలకు పాల్పడేవారిని.. ఇకపై బాధితుల కళ్లే పట్టించనున్నాయి. బాధితుల కనుపాపల్లోని ప్రతిబింబాల ఆధారంగా.. వారిపై దాడి చేసినవారిని తేలిగ్గానే గుర్తించేందుకు ఉపయోగపడే ఓ కొత్త పద్ధతిని యూనివర్సిటీ ఆఫ్ యార్క్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో పరిశోధకులు కనుగొన్నారు. డిజిటల్ ఫొటోగ్రఫీలో సరికొత్తదైన ఈ టెక్నిక్‌తో చాలా కచ్చితత్వంతో అనుమానితులను గుర్తించినట్లు పరిశోధన బృందం సారథి రాబ్ జెన్‌కిన్స్ వెల్లడించారు. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్నప్పుడు లేదా ఎవరినైనా బందీలుగా పట్టుకున్నప్పుడు తీసిన బాధితుల ఫొటోలు,  కెమెరా రికార్డింగుల ఆధారంగా వారి కళ్లలోని ప్రతిబింబాలను ఈ పద్ధతిలో గుర్తించవచ్చని తెలిపారు.

బాధితుల ముఖం ఫొటోలను బాగా జూమ్ చేసి.. వారి ముఖం కన్నా 30 వేల రెట్లు చిన్నగా కళ్లలో ఉన్న ప్రతిబింబాన్ని కూడా చూడవచ్చన్నారు. కొంతమందిపై ఈ టెక్నిక్‌ను ఉపయోగించగా.. తమపై దాడికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులను 71 శాతం కచ్చితత్వంతో, తెలిసిన వ్యక్తులను 84 శాతం కచ్చితత్వంతో గుర్తించారని వివరించారు. మనిషి కంటిపాప ఓ నల్ల అద్దంలాంటిదని, దాని ఫొటోలను జూమ్ చేసి హై రెసొల్యూషన్ ప్రతిబింబాలను చూడవచ్చన్నారు. నేరాల దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆధారంగా ఈ టెక్నిక్ ఉపయోగపడుతుందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు