కళల సాగు..

22 Jul, 2014 00:45 IST|Sakshi
కళల సాగు..

పంటలు అందరూ సాగు చేస్తారు. కానీ జపాన్‌లోని ఇనాకదాతే గ్రామస్తులు పంటలతోపాటు కళలను సాగు చేస్తారు. ఈ చిత్రమే అందుకు నిదర్శనం. ఇక్కడ కళలు, పంటలు జోడెద్దుల్లా కలిసి నడుస్తాయి. ఈ గ్రామం వరి పంటకు ప్రసిద్ధి. ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. ఇక్కడి వరి వంగడాలు 2 వేల ఏళ్ల పురాతనమైనవని 1990ల్లో వీరికి తెలిసింది. ఈ ఘనతకు గుర్తుగా ఏదైనా చేయాలని గ్రామస్తులు అనుకున్నారు. దీంతోపాటు తమ గ్రామానికి పర్యాటకపరంగా గుర్తింపు తేవాలనుకున్నారు. అప్పుడు మొదలైంది ఈ కళల సాగు. చేనును కాన్వాసుగా మలిచారు.

మామూలుగా వరి పచ్చగా ఉంటుంది. వీటి మధ్యన పెయింటింగ్‌కు తగ్గట్లు వేరే రంగులు వచ్చే వరి వంగడాలను నాటారు. అంతే.. అద్భుతమైన కళాఖండాలు సిద్ధమయ్యాయి. వీరి పెయింటింగ్‌లలో ఏదీ రిపీట్ కాదు. ప్రతిసారీ కొత్తది వేస్తారు. అది సరిగా వచ్చేందుకు ముందుగా కంప్యూటర్‌లో డిజైన్ చేసుకుంటారు. ఇనాకదాతేను చూసి.. జపాన్‌లోని మరో వంద గ్రామాలు దీన్ని మొదలుపెట్టాయి. అయితే, ఇనాకదాతే ఇందులో చాంపియన్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ అలరించే ఈ రైస్ ఆర్ట్‌ను చూడటానికి ఏటా రెండు లక్షల మంది ఈ గ్రామానికి వస్తారు.
 

మరిన్ని వార్తలు