విన్యాసాలతో ముద్దూ ముచ్చట

29 Mar, 2015 03:44 IST|Sakshi
విన్యాసాలతో ముద్దూ ముచ్చట

ఫ్లోరిడా: పరస్పర ప్రేమను వ్యక్తీకరించుకోవడంలోనూ పెళ్లి చేసుకోవడంలోనూ వినూత్న పద్ధతులను ఆశ్రయించడం అమెరికా యువతీ యువకులకు పరిపాటే. అలాగే ఫ్లోరిడాలోని ఒకోయిలో ఉంటున్న జో, ఇలియానాలు గాఢంగా  ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందు నిశ్చితార్థాన్ని వినూత్నంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆకాశమార్గాన విహరిస్తూ, సముద్ర గర్భంలో జలకాలుడుతూ, పర్వతారోహన చేస్తూ నిశ్చితార్థం జరుపుకోవాలా? ఆహా...ఇవిన్నీ పాతపడిన విద్యలే. జీవితాంతం కలిసున్నా, లేకున్నా జీవితాంతం గుర్తుండేలా ఇంకా కొత్తగా, వినూత్నంగా నిశ్చితార్థం జరుపుకోవాలని ఆలోచించారు. వారి మధ్య ప్రేమ అంకురించి, వికసించిందీ జిమ్‌లోనే.  కనుక జిమ్‌లోనే నిశ్చితార్థం జరుపుకోవాలని నిర్ణయానికొచ్చారు.
 
 అయితే ఎలా అన్నది మరో ప్రశ్న... మళ్లీ ఆలోచించారు. జిమ్నాస్టిక్స్‌లోనూ వెయిట్ లిఫ్టింగ్‌లోను ఇద్దరు నిపుణులే అవడం వల్ల కసరత్తు చేస్తూనే కళ్యాణ గడియలకు నిశ్చితార్థం జరుపుకోవాలని అనుకున్నారు. వెంటనే ఫొటోగ్రాఫర్‌ను పిలిపించారు. వివిధ రకాల విన్యాసాలు చేస్తూ నిశ్చితార్థం పేరిట ముద్దూ ముచ్చట తీర్చుకున్నారు. వారిని వివిధ భంగిమల్లో ఫొటోలు తీసిన సదరు ఫొటోగ్రాఫర్ నిజంగా ఇది కొత్తగాను, గమ్మత్తుగాను ఉందంటూ భావి దంపతులను ఆశీర్వదించారు. బ్యూనా విస్టా సరస్సు సమీపంలోని ప్యారడైజ్ పందిట్లో ఏప్రిల్ 30వ తేదీన వారు పెళ్లి చేసుకోబోతున్నారు. నిశ్చితార్థానికే  సిగ్గేలనే... ఎగ్గేలనే ...అనుకుంటూ చెమటోడ్చి ముద్దులు పెట్టుకున్న వారు పెళ్లికి మరెలాంటి విన్యాసాలు చేస్తూ ఆహూతులను ఆకట్టుకుంటారో మరి!

మరిన్ని వార్తలు