కాకులు కొవ్వు కొవ్వు అంటున్నాయి!

11 Sep, 2019 04:34 IST|Sakshi

న్యూయార్క్‌.... తెలవారుతున్న సమయం.. కోయిలల కజిన్స్‌ కాకులు తమదైన గోల చేస్తున్నాయి! ఆ కావ్‌.. కావ్‌లు.. అందరికీ వినిపిస్తున్నాయిగానీ... కొందరు శాస్త్రవేత్తలకు మాత్రం కాకులు... ‘‘కొవ్వు.. కొవ్వు’’ అంటున్నట్లుగా ఉన్నాయి!

కాకులకు కొవ్వుకు సంబంధం ఏంటనేగా మీ ఆలోచన? చాన్నాళ్లుగా నగరాల్లో ఉండటంతో అవి తమ సహజమైన ఆహారం తినడం మానేశాయి. మనిషి తిని పారేసిన చీజ్‌బర్గర్లు, హాట్‌డాగ్‌లు తినే బతుకు వెళ్లదీస్తున్నాయి. ఫలితం అచ్చం మన మాదిరిగానే అవి కొవ్కెక్కిపోతున్నాయి! ఆండ్రియా టౌన్‌సెండ్‌ అనే శాస్త్రవేత్త తన బృందంతో కలిసి చేసిన ఓ పరిశోధన ఈ విషయాన్ని తేల్చింది. నగర జీవనం మనుషులనే కాదు.. కాకుల్లాంటి చిన్న జీవులను ప్రభావితం చేస్తోందనేందుకు ఇదే తార్కాణమని ఆండ్రియా చెప్పారు. పిచ్చుకలు, కాకుల్లాంటి జీవులంటే ఆండ్రియాకూ మక్కువే. హామిల్టన్‌ కాలేజ్‌లో ఆర్నిథాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆండ్రియాకు ఓ ఆలోచన వచ్చింది. మనలాగే కాకులు కూడా చీజ్‌బర్గర్లు తింటే ఏమవుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఒక పరిశోధన మొదలుపెట్టింది.

కాలిఫోర్నియాలోని డేవిస్‌ ప్రాంతంలో సుమారు 140 కాకిగూళ్లను ఎంచుకుని అక్కడి వాటికి మెక్‌డొనాల్డ్‌ చీజ్‌బర్గర్లు అందించడం మొదలుపెట్టింది. గూళ్లు ఉన్న చెట్టు కింద ఉంచిన బర్గర్లను కాకులు ఇష్టంగా తిన్నాయని.. ఒక్కో కాకి మూడు బర్గర్లు లాగించేసిందని ఆండ్రియా తెలిపారు. కొన్ని కాకులు బర్గర్‌ ముక్కలను గూళ్లకు మోసుకెళ్లడమూ చూశామని తెలిపారు. ఆ తరువాత ఇదే ప్రయోగాన్ని గ్రామీణ ప్రాంతమైన క్లింటన్‌లోనూ చేపట్టారు. మూడేళ్లపాటు జరిగిన ఈ పరిశోధనలో గ్రామీణ ప్రాంతాల్లోని కాకులతో నగరాల్లోని కాకులను పోల్చి చూశారు కూడా. తేలిందేమిటంటే.. కాంక్రీట్‌ జనారణ్యంలో ఉన్న కాకుల్లో కొలెస్ట్రాల్‌ చాలా ఎక్కువగా ఉందీ అని! అంతేకాదు.. గ్రామీణ ప్రాంత కాకులతో పోలిస్తే నగర ప్రాంత కాకులు తొందరగా మరణిస్తున్నట్లు గుర్తించారు. కొలెస్ట్రాల్‌ ఎక్కువవడం వల్లనే మరణించాయా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది తేలాల్సి ఉంది. 

శుద్ధి చేసిన ఆహారంతో సమస్య
ఆండ్రియా పరిశోధన వివరాలు ‘ద కాండోర్‌’ అనే జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. నగరజీవనం కాకులను ఎలా ప్రభావితం చేస్తోందో చెబుతుంది ఈ పరిశోధన. మనుషులు తినగా మిగిలిన ఆహారం.. ముఖ్యంగా బ్రెడ్, పిజ్జా, చీజ్‌ వంటి శుద్ధి చేసిన ఆహారం ఎక్కువగా తినడం వల్లనే కాకులకు కొలెస్ట్రాల్‌ సమస్య వస్తోందని ఆండ్రియా అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కాకులు.. సహజంగా దొరికే ఇతర ఆహారంపై ఆధారపడతాయన్నది తెలిసిందే. గతంలో ఇదే అంశంపై జరిగిన ఒక పరిశోధన కూడా నగరాల్లోని చిన్న చిన్న జంతువుల్లో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నట్లు తేల్చింది. చిన్న చిన్న మోతాదుల్లో కొలెస్ట్రాల్‌ శరీరానికి మేలు చేసేదికాగా.. ఎక్కువైతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

>
మరిన్ని వార్తలు