మనిషి వద్దకు వెళ్లొద్దంటూ చీవాట్లు

28 Jul, 2016 14:31 IST|Sakshi
కాకులకు కూడా తెలివి ఎక్కువేనట!

వాషింగ్టన్: కార్విడ్ జాతికి చెందిన కాకులన్నీ మనకు ఒకేలా కనిపిస్తాయి. ఎక్కువ నలుపు, తక్కువ ఇతర రంగులు కలిగిన మాగ్‌పీస్ కాకులను మాత్రం మనం వేరుగా గుర్తించవచ్చు. కాకులు మాత్రం మనుషుల్ని గుర్తుపెట్టుకుంటాయి. ఏ మనిషి నుంచి ప్రమాదం పొంచి ఉందో, ఏ మనిషి నుంచి ప్రమాదంలేదో గుర్తిస్తాయి. అంతేకాకుండా పొంచి వున్న ప్రమాదాన్ని గుర్తించి తోటి కాకులను హెచ్చరిస్తాయి. ఫలానా మనిషి వద్దకు వెళ్లొద్దంటూ చీవాట్లు కూడా పెడతాయి. పెద్ద పెట్టున గోల చేస్తాయి. ఆ అరుపులనే మనం కాకిగోల అంటాం.

అంతేకాకుండా తమ జాతి కాకి చనిపోతే దాన్ని గుర్తు పడతాయి. దాన్ని దూరంగా తీసుకుపోతాయి. ఆ కాకి ఎందుకు చనిపోయిందో, ఎవరు అందుకు బాధ్యులో గుర్తించేందుకు కూడా ప్రయత్నిస్తాయి. భవిష్యత్తులో తమ జాతి పక్షులకు ఎవరి నుంచి ప్రమాదం ఉందో అంచనా వేసేందుకే అవి ఇలా ప్రవర్తిస్తాయి. ఈ అంశాలను సియాటిల్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన అధ్యయనకారులు శాస్త్రపద్ధతిలో ప్రయోగాలు జరిపి నిరూపించారు. వారు తమ అధ్యయన వివరాలను ‘యానిమల్ బిహేవియర్’ జర్నల్‌లో ప్రచురించారు.

కయేలి స్విస్ట్ అనే గ్రాడ్యువేట్ విద్యార్థిని ఈ ప్రయోగాల కోసం అధ్యయనకారులు ఎంపిక చేసుకున్నారు. ఆ విద్యార్థి ఒకే చోట రోజు కాకులకు ఆహారం పెడుతూ వచ్చారు. ఆ ప్రాంతానికి కాకులు రావడం ప్రారంభించాయి. ఒక రోజున   బూరుతీసిన ఓ కాకిలో, ఓ పావురంలో తినే పదార్థాలను కూర్చి,  వాటిని వేర్వేరుగా కాకుల తిండి గింజల పక్కన అమర్చి ముసుగులు ధరించిన వాలంటీర్లను పరిశీలకులుగా నియమించారు. బూరు తీసిన కాకి మాంసాన్ని గుర్తించిన కాకులు దాన్ని తాము తినే పదార్థాలకు దూరంగా తీసుకెళ్లి పెట్టాయి. తర్వాత వాలంటీర్ల దగ్గరకు వెళ్లొందన్నట్లుగా తోటి కాకులను గోల చేసి హెచ్చరించాయి. పదే పదే ఈ ప్రయోగాన్ని నిర్వహించగా కొన్నిసార్లు ముసుగులు ధరించిన వాలంటీర్లపైనా కూడా అవి దాడులు చేశాయి. ఒక్కసారి కూడా అవి తినే పదార్థాలను కూరిన పావురం వద్దకు వెళ్లలేదు.

కాకులు కూడా స్వజాతి పక్షపాతులేమో! కాకులకు కూడా తిండిపెట్టే స్నేహితులెవరో, చంపేసే శత్రువులెవరో గ్రహించే విచక్షణ జ్ఞానం ఉందని వాషింగ్టన్ యూనివర్శిటీ బయాలోజీ ప్రొఫెసర్ జాన్ మార్జులుఫ్ చెప్పారు. కాకి జాతిలో రంగులు కలిగి ఉండే మాగ్‌పీస్ కాకులు పక్షులన్నింటిలోకెల్లా తెలివిగలవని శాస్త్రవేత్తలు చెబుతారు.

మరిన్ని వార్తలు