భారీగా పుంజుకున్న చమురు

10 Mar, 2020 19:30 IST|Sakshi

సోమవారం నాటి భారీ పతనం నుంచి చమురు ధరలు భారీగా ఎగిసాయి. కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) భయాలకు తోడు,  రష్యా సౌదీ అరేబియా ప్రైస్‌ వార్‌ నేపథ్యంలో 29 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన చమురు మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్) తో చర్చలు కొనసాగవచ్చని రష్యా సూచనలతో ముడి చమురు ధర 11శాతం పెరిగింది. ముడి చమురు ప్రస్తుతం బ్యారెల్‌కు 38 డాలర్లుగా వుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) 11 శాతం పెరిగి బ్యారెల్కు 34 డాలర్లకు చేరుకుంది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటున్నామని రష్యా ఇంధన మంత్రి ఆశావహ వ్యాఖ్యలతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కూడా మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది. 

అటు గ్లోబల్‌ మార్కెట్లు కూడా భారీ పతనంనుంచి  కాస్త తెప్పరిల్లాయి. డౌజౌన్స్‌ 900 పాయింట్లు జంప్‌ చేసింది. ఎస్‌ అండ్‌ పీ 3.5 శాతం, నాస్‌డాక్‌ 3.6 శాతం ఎగిసింది. కాగా దేశీయ స్టాక్‌మార్కెట్లకు హోలీ సందర్భంగా మంగళవారం సెలవు. తాజా పరిణామాల నేపథ్యంలో కీలక సూచీలు రేపు (బుధవారం) భారీగా రికవరీ సాధించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు