ఫిజీని వణికిస్తున్న తుఫాను

20 Feb, 2016 15:47 IST|Sakshi

సువా: పసిఫిక్ దక్షిణ ప్రాంత దీవుల సముదాయం ఫిజీ దేశాన్ని అత్యంత బలమైన తుఫాను 'విన్స్టన్' వణికిస్తోంది.  గతవారం టోంగా దీవులను తాకిన ఈ తుఫాను తిరిగి తీవ్రరూపం దాల్చి ఫిజీ రాజధాని సువా దిశగా దూసుకొస్తోంది. తుఫాను దాటికి శనివారం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. విన్స్టన్ ప్రభావంతో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్లు ఫిజీ వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని అన్ని విమానసర్వీసులను రద్దు చేశారు.

ఫిజీ ప్రధాని బైనీమరామ ప్రజలను సురక్షితంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తుఫాను ప్రభావానికి గురికానున్న పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేశ వ్యాప్తంగా 758 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. రాజధాని సువా ప్రాంతంలో తుఫాను అత్యధిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. పసిఫిక్ దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అత్యంత బలమైన తుఫానుగా యూఎన్ వాతావరణ విభాగం 'విన్స్టన్'ను పేర్కొంది.
 

మరిన్ని వార్తలు