నాన్న కుట్టిగా ఆ చిట్టితల్లి!

9 Dec, 2015 13:35 IST|Sakshi
నాన్న కుట్టిగా ఆ చిట్టితల్లి!

భూమి మీదకు అడుగుపెడుతూనే 46 బిలియన్ డాలర్ల సంపదకు వారసురాలైంది ఆ చిట్టితల్లి. తన రాకను ఘనంగా స్వాగతిస్తూ స్వచ్ఛంద సేవ కార్యక్రమాల కోసం రూ. 3 లక్షల కోట్లు విరాళంగా ఇచ్చాడు ఆమె తండ్రి. ఔను! మనం మాట్లాడుకోబోతున్నది మాక్సిమా చాన్ జూకర్బర్గ్ గురించే. ఇప్పటికే ఫేస్బుక్ సంస్థ నుంచి రెండు నెలలు పెటర్నటీ సెలవు తీసుకున్న జుకర్బర్గ్ తన చిట్టితల్లి మాక్సిమాతోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఆమె కూడా 'నాన్నకుట్టి'లా మారిపోయినట్టే కనిపిస్తున్నది. తన కూతురిని తొలిసారిగా తాకిన మధురానుభూతిని ఫొటోల ద్వారా జుకర్బర్గ్ మంగళవారం ఫేస్బుక్లో పంచుకున్నాడు.

ఓ సాధారణ తండ్రిలాగా తన చిన్నారి పక్కన కార్పెట్ మీద పడుకొని ఆమెను చూసి మురిసిపోతున్న ఫొటోను ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడైన జుకర్ బర్గ్ పంచుకొన్నారు. ఈ ఫొటోకు వేలసంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. అభిమానుల కామెంట్లకు సమాధానమిచ్చిన జుకర్బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్, కూతురు మాక్సిమా చాలాబాగా ఉన్నారని తెలిపారు. ఈ ఫొటోతోపాటు కామెడీ హనుక్కా దుస్తుల్లో 'బీస్ట్'  అనే బుజ్జికుక్క ఫొటోను కూడా షేర్ చేశారు.

అయితే ఫేస్బుక్ లో కొందరు అభిమానులు జుక్ తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు.  కార్పెట్ మీద కాకుండా ఓ దుప్పటి పరిచి అందులో చిన్నారిని పడుకోబెట్టాలని, లేకుంటే అశుభ్రత, జెమ్స్ కారణంగా చిన్నారికి ఏమైనా హాని జరుగవచ్చునని సున్నితంగా సలహాలు ఇచ్చారు. శిశువుల సంరక్షణ, పరిశుభ్రత అంశాలపై చర్చించారు. మొత్తానికి ఈ పోస్టు జుకర్బర్గ్ గత పోస్టుల మాదిరిగానే ఫేస్బుక్ లో హల్ చల్ చేస్తోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు