నవ్వుతుండగానే బ్రెయిన్‌కు సర్జరీ

30 Oct, 2019 20:57 IST|Sakshi

న్యూఢిల్లీ : జార్జియాలోని బ్రినావ్‌ యూనివర్శిటీలో చదువుతున్న జెన్నా స్కార్డ్‌ అనే 25 ఏళ్ల వైద్య విద్యార్థిని బ్రెయిన్‌ స్ట్రోక్‌ రాకుండా ఎలా నివారించుకోవచ్చో రోగులకు శిక్షణ ఇస్తుండగా, హఠాత్తుగా మూర్చరోగం లాగా వచ్చి పడిపోయింది. కాళ్లు, చేతులు వణికిపోయాయి. ఆమెను వైద్యులు వచ్చి పరీక్షించగా, ఆమె ‘కవర్‌నోమా’తో బాధ పడుతున్నట్లు తేలింది. అంటే మెదడులోని ఆక్సిజన్‌ తీసుకెళ్లే మంచి రక్తనాళాలు, చెడు రక్తం నాళాలు ఓ చోట కలుసుకొని బిగుసుకుపోవడం, దాని వల్ల అక్కడ రక్తనాళాలు తెగి మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

సర్జరీ తప్పదని డాక్టర్లు చెప్పడంతో ఇలినాయికి చెందిన జెన్నా, డల్లాస్‌లోని మెథడిస్ట్‌ మెడికల్‌ సెంటర్‌ ఆస్పత్రిలో చేరింది. మాట్లాడే ప్రక్రియను నియంత్రించే మెదడు ప్రాంతానికి అతి సమీపంలోనే మంచి, చెడు రక్తనాళాలు బిగుసుకుపోయాయి. సర్జరీలో ఏ మాత్రం పొరపాటు జరిగినా ఆమెకు మాట పడిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు గ్రహించి ఆమెను హెచ్చరించారు. అందుకు ప్రత్యామ్నాయం ఏమిటని ఆమె ప్రశ్నించగా, మెదడుకు ఆపరేషన్‌ చేస్తున్నంత సేపు ఏదో ఒకటి మాట్లాడుతుండాలని, అలా మాట్లాడాలంటే ఎలాంటి మత్తు తీసుకోరాదని చెప్పారు.

స్వతహాగ ఓ థెరపిస్ట్‌ కోర్సు చేస్తున్నందున ఎలాంటి మత్తు ఇవ్వకుండా సర్జరీ చేయమని డాక్టర్లకు చెప్పారు. వారు అలాగే సర్జరీని ప్రారంభించారు. సర్జరీ జరుగుతున్నంత సేపు ఆమె మాట్లాడుతుండడమే కాకుండా ఎక్కడా బాధ పడుతున్నట్లు కనిపించకుండా నవ్వుతూ కనిపించారు. దీన్ని వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌ అవుతోంది. ఇలాంటి సర్జరీలు జరగడం చాలా అరుదు.

మరిన్ని వార్తలు