గుండె జబ్బులపై అద్భుత విజయం

3 Aug, 2019 20:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : గుండె జబ్బులను నివారించడంలో కేంబ్రిడ్జి పరిశోధకులు అద్భుతమైన విజయం సాధించారు. గుండెపోటు వల్ల చనిపోయిన గుండె రక్తనాళాలు, గుండె కణజాలానికి తిరిగి ప్రాణం పోశారు. గుండెపోటు వచ్చినప్పుడు కణజాలానికి ఆక్సిజన్‌ అందక గుండెలోని కొన్ని ప్రాంతాలు దెబ్బతింటాయి. అక్కడి కణజాలం శాశ్వతంగా చనిపోతుంది. దానికి జీవం పోయడానికి గతంలో పరిశోధకులు చేసిన ప్రయోగాలు ఏమీ విజయం సాధించలేక పోయాయి.

కేంబ్రిడ్జి పరిశోధకులు మానవ గుండె నుంచి రెండు రకాల స్టెమ్‌ సెల్స్‌ను తీసుకొని వాటికి ఎలుకలలోని చచ్చిన గుండె కణజాలంలోకి ఎక్కించారు. వాటిని లాబరేటరీలో ఉంచి ఎదగనిచ్చారు. ఆ తర్వాత ఆ కణజాలాన్ని తీసుకెళ్లి ఎలుకల గుండెల్లోకి ఎక్కించారు. ఆశ్చర్యంగా అప్పటికే చచ్చిన ఎలుకల గుండెలోని కణజాలం తిరిగి ప్రాణం పోసుకుంది. ఇక ఈ ప్రయోగాన్ని మానవ గుండెలపై చేయడమే తరువాయని అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్‌ సంజయ్‌ సిన్హా తెలిపారు. బ్రిటన్‌లో ఏటా తొమ్మిది లక్షల మంది గుండె పోటుకు గురవుతున్నారు. అలాంటప్పుడు వారి గుండెలో ఏదో ప్రాంతం చనిపోతోంది. పర్యావసానంగా వారు మరోసారి గుండెపోటు వచ్చినప్పుడు మరణిస్తున్నారు. వారిలో ప్రస్తుతం కేవలం 200 మందికి మాత్రమే గుండె మార్పిడి చికిత్సలు చేయగలగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రయోగం ద్వారా అద్భుత విజయాలు సాధించవచ్చని డాక్టర్‌ సంజయ్‌ చెప్పారు. అమెరికాలో అయితే ఏకంగా ఏటా దాదాపు 50 లక్షల మంది గుండె పోటుకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు