భూమికి డేంజర్ బెల్స్!

18 Apr, 2016 01:02 IST|Sakshi
భూమికి డేంజర్ బెల్స్!

భూకంప క్రియాశీలక దశలోకి భూమి!
 
 బీజింగ్: వరుస భూకంపాలతో ప్రపంచం వణికిపోతోంది. మొన్న జపాన్ (7.3 తీవ్రత), నిన్న ఈక్వెడార్(7.8) భూ విలయ విధ్వంసానికి సాక్ష్యాలుగా మిగిలాయి. తాజాగా ఆదివారం పసిఫిక్ ద్వీప దేశం టోంగాలోనూ రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో ఓ భూకంపం సంభవించింది. వనౌతు, మయన్మార్, అఫ్గానిస్తాన్, ఫిలిప్పీన్స్... ఇలా పలు దేశాల్లో ఇటీవల భూకంపాలు చోటు చేసుకున్నాయి. పలు సందర్భాల్లో సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. వీటికి తోడు తక్కువ తీవ్రతతో నిత్యం ఎక్కడో ఓ చోట భూమి కంపిస్తూనే ఉంది. ఈ భూ ప్రకోపం ఇంతటితో ఆగుతుందా? లేక... మరింత శక్తిమంతమైన, ప్రపంచాన్నే కకావికలు చేయగల భారీ స్థాయి భూ విస్ఫోటనానికి ఈ వరుస భూకంపాలు సంకేతాలా? భూగ్రహం మరోసారి భూకంప క్రియాశీలక దశలోకి వెళ్తోందా? భూ భౌతిక శాస్త్రవేత్తలను ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న ప్రశ్నలివి!!

 భూమి క్రమంగా భూకంప క్రియాశీలక దశలోకి వెళ్తోందా అన్న అంశంపై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కచ్చితంగా ఔనని సమాధానం చెప్పలేమని అమెరికా జియలాజికల్ సర్వేకు చెందిన భూ భౌతిక శాస్త్రవేత్త రాండీ బల్ద్విన్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పుడైనా భూకంపాలకు అవకాశం ఉంటుందని, కాకపోతే వేర్వేరు జోన్లలో సంభవించే భూకంపాలకు పరస్పర సంబంధముందా అన్నదానిపై స్పష్టమైన నిర్ధారణ లేదని అన్నారు. కానీ ఇటీవలి వరుస భూకంపాలు కచ్చితంగా మున్ముందు సంభవించబోయే మరో మెగా భూకంపానికి హెచ్చరికల్లాంటివని కొలరాడొ వర్సిటీకి చెందిన భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రవేత్త రోజర్ బిల్హమ్ స్పష్టం చేశారు.

భూగర్భంలో మార్పుల వల్ల సమీప భవిష్యత్తులో రిక్టర్ స్కేల్‌పై 8 పాయింట్ల తీవ్రతను మించిన కనీసం మరో నాలుగు భూకంపాలు భూమిని కుదిపేసే ప్రమాదముందని హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో కాకపోయినా కాస్త ఆలస్యంగానైనా మరో మెగా భూకంప ప్రమాదం పొంచే ఉందన్నారు. అయితే ఇలాంటి మెగా భూకంపాలు రావడం అత్యంత అరుదని అమెరికా జియలాజికల్ సర్వే పేర్కొంటోంది. కాకపోతే అది అసాధ్యం మాత్రం కాదనడం గమనార్హం. ఇటీవలి భూకంపాల తీవ్రత సాధారణ స్థాయిలోనే ఉన్నా, ఆ ప్రాంతాలపై ఇంకా లోతుగా అధ్యయనం జరగాల్సి ఉందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
 
90 శాతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లోనే
20వ శతాబ్దంలోని మొదటి 60 ఏళ్లలో ఎక్కువ భూకంపాలు వచ్చా యి.  8.5 కన్నా ఎక్కువ తీవ్రతతో 7 భూకంపాలొచ్చాయి. ఇండోనేసియా, జపాన్‌ల భౌగోళిక ప్రాంతం సర్కమ్-పసిఫిక్ భూకంప ప్రాంతంలో ఉన్నందున అక్కడ భూకంపాలు వస్తుంటాయంటున్నారు. ఈ ప్రాంతం అమెరికా పసిఫిక్ తీరం, చైనాలోని తైవాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ వరకు విస్తరించి మూడొంతుల భూకంప శక్తిని విడుదల చేస్తుంది. దీన్ని ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ అంటారు. ఇది 40 వేల కి.మీ. మేర విస్తరించి ఉంది. ప్రపంచంలోని మొత్తం భూకంపాల్లో 90 శాతం ఇక్కడే వస్తుంటాయి. ఇక్కడ టెక్టానిక్ పలకలు కదలడం నిత్యకృత్యం.

 భారీభూకంపాల దశలోకి టిబెట్!
 చైనాలోని ఖింగాయ్-టిబెట్ పీఠభూమిలోని దక్షిణాది ప్రాంతాల్లో భూతత్వం ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంటుందని, ఆ ప్రాంతం ఇ ప్పుడు భారీ భూకంపాల దశలోకి ప్రవేశిస్తోందని చైనా భూకంప కేంద్రానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ పరిశోధకుడు జుజివే చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు