మనోళ్ల కొలువులకు పెనుగండం

1 Feb, 2017 03:20 IST|Sakshi
మనోళ్ల కొలువులకు పెనుగండం

సుమారు 88 వేల మంది ఐటీ ఉద్యోగాలపై కత్తి!

  • హెచ్‌1బీ వీసాతో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు 3.5 లక్షలు
  • ఇందులో 1.06 లక్షల మంది తెలుగువారే
  • వీరిలో 83 శాతం మంది వేతనాలు 1.29 లక్షల డాలర్లలోపే

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ‘ట్రంప్‌’గండం వచ్చింది. హెచ్‌1బీ వీసాల నిబంధనల్లో అమెరికా అధ్యక్షుడు మార్పులు చేయడంతో లక్షలాది మంది భవిష్యత్తు అంధకారంలో పడింది. ఇప్పటికే అక్కడ ఉద్యోగం చేస్తున్న 1.06 లక్షల మంది తెలుగువారిలో ఏకంగా 83 శాతం మంది మెడపై కత్తి వేలాడుతోంది. అంటే దాదాపు 80 వేల మందికిపైగా స్వదేశానికి తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడనుంది. అమెరికాలో లక్షా 30 వేల డాలర్లు, ఆపైన వార్షిక వేతనం ఉంటేనే హెచ్‌1బీ వీసాపై ఉద్యోగం చేసుకోవడానికి అనుమతినిచ్చే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ సంతకం చేయడంతో ఈ చిక్కు వచ్చిపడింది. అమెరికాలో ఈ వీసాపై మూడున్నర లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరే కాకుండా మూడేళ్లుగా అక్కడి విశ్వవిద్యాలయాల్లో మాస్టర్‌ డిగ్రీ కోసం మరో మూడు లక్షల మంది వెళ్లారు. వీరందరి లక్ష్యం మాస్టర్‌ డిగ్రీ తర్వాత అక్కడి ఐటీ కంపెనీల్లో ఉద్యోగం పొందడమే. ఇప్పుడు వీరంతా ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఉద్యోగాలే లక్ష్యం
అమెరికాకు వెళ్లే భారత విద్యార్థులు అక్కడి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలే లక్ష్యంగా వెళుతుంటారు. గతేడాది (2016)లో 1.65 లక్షల మంది, అంతకుముందు రెండేళ్ల (2014. 2015)లో కలిపి 1.35 లక్షల మంది భారత విద్యార్థులు మాస్టర్స్‌ డిగ్రీ కోసం అమెరికా వెళ్లారు. వారంతా ఇప్పుడు ఓపీటీపై వేర్వేరు కంపెనీల్లో 60 వేల డాలర్లు నుంచి 90 వేల డాలర్ల వరకు వేతనాలతో ఉద్యోగాలు చేస్తూ హెచ్‌1బీ వీసా కోసం ఎదురుచూస్తున్నారు. ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ చట్టరూపం దాల్చగానే వీరంతా వెంటనే స్వదేశానికి బయలుదేరాల్సి ఉంటుంది.

అర్హులు 13 శాతమే!
అమెరికన్‌ కంపెనీలతోపాటు అక్కడి భారతీయ కంపెనీలల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల్లో 13 శాతం మాత్రమే 1.3 లక్షల డాలర్లు, అంతకంటే ఎక్కువ వేతనం పొందుతున్నారు. మిగతా 87 శాతం పరిస్థితి అగమ్య గోచరమే. ఇక ఉద్యోగాల్లేకుండా ఓపీటీపై ఉన్న వారు, తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు చేస్తున్న వారికి హెచ్‌1బీ వీసా పొందేందుకు కూడా అవకాశం ఉండదు. ప్రస్తుతం లాటరీ పద్ధతిన హెచ్‌1బీ వీసాలిచ్చే విధానాన్ని తొలగిస్తున్నారు. అమెరికా వర్సిటీల్లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉండే 20 శాతం కోటా కూడా రద్దవుతుంది. అంటే 1.3 లక్షల డాలర్లు, అంతకంటే ఎక్కువ వేతనమున్న వారికి నేరుగా హెచ్‌1బీ వీసా లభిస్తుంది. అయితే మాస్టర్స్‌ డిగ్రీ చదివిన వారికి క్యాంపస్‌ సెలక్షన్స్‌ ద్వారా 1.3 లక్షల డాలర్లు, ఆపై వార్షిక వేతనంతో ఉద్యోగం లభిస్తే వెంటనే వర్క్‌ వీసా లభిస్తుంది.

పెద్ద కంపెనీ ఉద్యోగుల పరిస్థితి నయం
ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల వేతనాలే ఎక్కువగా ఉన్నాయి. 1.3 లక్షల డాలర్లు, ఆపై వేతనం పొందుతున్న వారిలో 98 శాతం మంది ఈ కంపెనీల్లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. అక్కడి సాధారణ భారతీయ కంపెనీల్లో పనిచేయడానికి వెళ్లిన హెచ్‌1బీ, ఎల్‌1 వీసాదారుల్లో 98 శాతం మంది వేతనం 1.10 లక్షల డాలర్ల లోపే. అంటే ఈ కంపెనీల్లో పనిచేస్తున్న వారిలో 2 శాతం మంది మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగే అవకాశం ఉండనుంది.

అమెరికా వర్సిటీలకు క్యూ కట్టిన భారత కంపెనీలు
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్కడి భారతీయ ఐటీ కంపెనీలు స్థానికులను ఉద్యోగాల్లో చేర్చుకునే పనిలో పడ్డాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం వంటి కంపెనీలు డిసెంబర్‌ తొలి వారం నుంచే అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఎంపికకు టాలెంట్‌ హంట్‌లు నిర్వహిస్తున్నాయి. భారతీయ విద్యార్థులను ఆ టాలెంట్‌ హంట్‌లకు హాజరుకానివ్వడం లేదు. అయితే అమెరికన్‌ విద్యార్థుల్లో సృజనాత్మకత అంతగా లేదని, అది తమకు ప్రతికూల అంశమని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. అక్కడి వారికి ఉద్యోగాలిస్తే ఇంత మొత్తంలో వేతనం ఇవ్వాలన్న నిబంధనేదీ లేదు. అయితే ఎక్కువ వేతనం ఆఫర్‌ చేసినా కూడా అవసరమైన సామర్థ్యం, ప్రతిభ ఉన్న అమెరికన్లు్ల దొరకడం లేదని నాస్కాం ప్రతినిధి ఆర్‌.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ప్రస్తుత జఠిల పరిస్థితిని ఇక్కడి ఐటీ కంపెనీలు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు లేకపోలేదని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో బాలకృష్ణ మీడియాతో చెప్పారు.

ఎవరికి లాభం?
అమెరికా ప్రతిపాదిత వేతనం అమల్లోకి వస్తే 1.15 లక్షల డాలర్లు అంతకంటే ఎక్కువ వేతనం పొందుతున్న భారతీయ ఉద్యోగులకు 1.30 లక్షల డాలర్ల వేతనం లభించే అవకాశాలున్నాయి. వారు ట్రంప్‌ ప్రతిపాదిం చిన వేతనానికి దగ్గరగా ఉండటంతో కంపెనీలు.. ఆ మేరకు వేతనాలు పెంచి, ఉద్యోగాలు కొనసాగించ వచ్చు. ఇదే జరిగితే మరో 15 శాతం మంది భారతీయ ఉద్యోగులు అక్కడే ఉండేందుకు వీలు కలుగుతుంది. కానీ అమెరికన్‌ సంస్థలతో పాటు ఇతర అంతర్జాతీయ కంపెనీల్లోనే ఈ అవకాశం ఉండనుంది. ఎందుకంటే అక్కడి భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈస్థాయి వేతనాలు ఇవ్వాలంటే కష్టమే!

ఎవరెవరికి నష్టం?
అమెరికాలోని ఐటీ కంపెనీల్లో దాదాపు 3.5 లక్షల మంది భారతీయ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో తెలంగాణ, ఏపీలకు చెందినవారు 1.06 లక్షల మంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే.. మొత్తం భారతీయ ఉద్యోగుల్లో 13 శాతం అంటే సుమారు 50 వేల మంది మాత్రమే అక్కడ ఉం టారు. మిగతా మూడు లక్షల మంది స్వదేశం బాట పట్టాల్సి ఉం టుంది. ఇదే తెలుగువారి విషయానికి వస్తే 17 శాతం అంటే సుమారు 18 వేల మంది మాత్రమే 1.3 లక్షల డాలర్లు, ఆపై వేతనం పొందుతున్నారు. ఈ లెక్కన మిగతా 88 వేల మంది వరకు తిరుగుముఖం పట్టాల్సిందే! ఇందులో అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ చదివి, ఉద్యోగాలు చేస్తున్న వారు 55 వేల మందికాగా.. మిగతావారు భారతీయ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నవారు.

>
మరిన్ని వార్తలు