భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి: ట్రంప్‌

23 Feb, 2019 09:06 IST|Sakshi

వాషింగ్టన్‌: పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌​‍-పాకిస్తాన్‌ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో భారత్‌ చాలా బలంగా ఉందని, ఉగ్రవాదాన్ని పోత్సహించడం పాకిస్తాన్‌కు సరైనది కాదని అన్నారు. ఈ పరిణామం ఇరుదేశాల మధ్య ప్రమాదకరమైన పరిస్థితిగా మారిందని చెప్పారు. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణగాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఇరుదేశాల అధికారులతో చర్చిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఉగ్రదాడిలో సుమారు 50 జ‌వాన్లు మృతి చెందార‌ని, ఆ ప‌రిస్థితిని అర్థం చేసుకోగలనన్న ఆయన....పాకిస్తాన్‌కు భారత్‌ గట్టి సమాధానం ఇవ్వాలని చూస్తుందన్నారు.

పుల్వామా దాడితో పాక్‌పై చర్యలు తీసుకోవాలని భారత్‌ అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో వాషింగ్టన్‌లోని ఓవల్‌ కార్యాలయంలో ట్రంప్‌ విలేకరులతో మాట్లాడారు. ఇరుదేశాలు సంయమనం పాటించి సమస్యకు ముంగిపు పలకాలని కోరారు.  ప్రస్తుత సమస్యను చర్చల ద్వారా నివారించకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తమ పాలనావ్యవస్థ మొత్తం భారత్‌కు సహాయ సహకారాలు అందిస్తుందని ట్రంప్‌ స్పష్టం చేశారు. అమెరికా ఇస్తున్న నిధులను పాకిస్తాన్‌ దుర్వినియోగం చేస్తుందనే..  గ‌తంలో తాము ఇచ్చే 1.3 బిలియ‌న్ డాల‌ర్ల నిధుల‌ను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు