ఏమీ లేకుండానే ఈఫిల్ టవర్ ఎక్కేశాడు..

10 Nov, 2015 20:05 IST|Sakshi
ఏమీ లేకుండానే ఈఫిల్ టవర్ ఎక్కేశాడు..

ప్రముఖ అధిరోహకుడు కింగ్‌స్టన్ చేతిలో ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండానే ఈఫిల్ టవర్ ఎక్కేశాడు. 25 ఏళ్ల కింగ్స్టన్ రెండేళ్ల కిందే భారీ క్రేన్ అధిరోహించి ఆ వీడియోని ఆన్లైన్లో పెట్టడంతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత భారీ భవనాలు, భారీ క్రేన్లు, ఎత్తైన పరిశ్రమల గొట్టాలు ఎక్కి ప్రపంచంలోని ప్రముఖ అధిరోహకుల్లో ఒకడయ్యాడు. ఇప్పుడు ఈఫిల్ టవర్ ఎక్కుతూ తీసిన వీడియో కూడా ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది. అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఈఫిల్ టవర్ ఎక్కడం విశేషం.    

కింగ్స్టన్, అతని క్లైంబింగ్ సహాచరుడు మాట్లాడుతూ..'ముందుగా టికెట్లు కొనుక్కొని టవర్ ప్రవేశం ద్వారం వైపుగా మెట్ల వరుస నుంచి అధిరోహించాలనుకున్నాము. అయితే  చాలా మంది ఉండటంతో అక్కడి నుంచి అధిరోహించడం అంత సులువు కాదని భావించాము. బయట నుంచే ఆ టవర్ని అధిరోహించాలని మేం ఇద్దరం నిర్ణయించుకున్నాము. రాత్రి సమయంలో మేం టవర్ అధిరోహించడం ప్రారంభించాం. సెక్కురిటీని తృటిలో తప్పించుకుంటూ నిదానంగా మా ప్రయాణం ప్రారంభమైంది. వాళ్లు ప్రెంచ్ ఆర్మీలా పెద్ద గన్లతో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. మేం టవర్ ఎక్కే సమయంలో లెక్కలేనన్ని సీసీ టీవీలు మాకు కనిపించాయి. ఎప్పుడైతే 20 మీటర్లు పైకి ఎక్కామో ఇక ఈఫిల్ టవర్ ఎక్కగలం అనే నమ్మకం కలిగింది. ఆ తర్వాత సూర్యోదయం సమయానికి టవర్ ఎక్కేశాము' అని తెలిపారు. అప్పటికే కింద ఉన్న భద్రతా అధికారులు వారిని గుర్తించడంతో వారిద్దరూ కిందికి దిగడంతోనే అరెస్ట్ చేశారు. వారిని ఆరు గంటల పాటూ విచారించిన అనంతరం.. మరోసారి ఈఫిల్ టవర్ అధిరోహించమని చెప్పడంతో వదిలేశారు.