డీ గ్యాంగ్‌లో సంక్షోభం

13 Dec, 2017 08:38 IST|Sakshi

దావూద్‌తో తెగదెంపులు చేసుకున్న చోటా షకీల్‌

దావూద్‌-చోటా షకీల్‌ మధ్య సమోధ్యకు ఐఎస్‌ఐ కృషి

డీ గ్యాంగ్‌లో అనీస్‌ ఇబ్రహీం జోక్యం వల్లే విబేధాలు

ఇస్లామాబాద్‌ : ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితులు.. దావూద్‌ ఇబ్రహీం,  చోటా షకీల్‌ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. దావూద్‌ ఇబ్రహీంకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న చోటా షకీల్‌ కొన్నాళ్లుగా కరాచీలో ప్రత్యేకంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విబేధాల వల్ల దావూద్‌ను చోటా షకీల్‌ కలిసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని చీకటి సామ్రాజ్యంలో గుసగులు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్తాన్‌ నిఘా సంస్థ అయిన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు ఒక రిపోర్ట్‌ ద్వారా బయటకు తెలిసింది. వీరిద్దరూ విడిపోతే  భారత ‍వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించలేమని ఐఎస్‌ఐ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.


దాదాపు మూడు దశాబ్దాలుగా అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు చోటా షకీల్‌ అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దావూద్‌ కుడి భుజంగా చోటాషకీల్‌ను డీ గ్యాంగ్‌ పిలుచుకుంటారు. దావూద్‌ ఇబ్రహీం సోదరుడు అనీస్‌ ఇబ్రహీం వల్ల ఇద్దరి మధ్య విభేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. డీ గ్యాంగ్‌ నిర్వహణలో అనీస్‌ జోక్యం పెరిగిపోవడంతో చోటా షకీల్‌ దావూద్‌తో విభేధించినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో చోటా షకీల్‌ తాజాగా తూర్పు ఆసియా దేశాల్లోని ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించారు.


ఇదిలాఉండగా.. చోటా షకీల్‌-దావూద్‌ ఇబ్రహీం మధ్య తిరిగి సయోధ్య నెలకొల్పేందుకు ఐఎస్‌ఐ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. డీ గ్యాంగ్‌ సహకారం వల్ల అప్పట్లో ముంబై వరుస బాంబు పేలుళ్లు పాకిస్తాన్‌ తెగబడింది. ఈ నేపథ్యంలోనే వారిని కలిపేందుకు ఐఎస్‌ఐ ‍ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు