జవాన్ల మధ్య ఘర్షణకి కారణం ఏంటంటే..

17 Jun, 2020 13:59 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌–చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీయడానికి టెంట్‌ వద్ద జరిగిన గొడవే కారణమని సమాచారం. వాస్తవాధీన రేఖకు(ఎల్‌ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్‌ ఏర్పాటు చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 అనే చోట చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) టెంట్‌ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. ఈ నెల ప్రారంభంలోనే ఈ టెంట్‌ వేశారు. (అప్పుడు మేము గర్వంగా ఫీలయ్యాం : కల్నల్‌ సంతోష్‌ సోదరి)

గత వారం ఇక్కడే భారత్, చైనా డివిజన్‌ కమాండర్‌ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గాల్వన్‌లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. జూన్‌ 6న భారత్‌, చైనా లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ర్యాంకు అధికారుల మధ్య జరిగిన సమావేశంలో టెంట్‌ తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే, పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు రాళ్లు విసరడం ప్రారంభించారు. ఇనుప రాడ్లతో దాడికి దిగారు. ఆరుగంటలపాటూ జరిగిన తోపులాటలోపక్కనే ఉన్న గాల్వన్‌లోయలో కూడా కొందరు సైనికులు పడిపోయారు. ఎముకలు కొరికే చలి, హైపోథెర్మియాతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 గాల్వన్, ష్యోక్‌ నదుల సంగమ ప్రాంతం సమీపంలోనే ఉంది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఇప్పటివరకు క‌ల్న‌ల్ స‌హా 20 మంది భార‌త సైనికులు మ‌ర‌ణించ‌గా, తాజాగా మరో నలుగురి జవాన్ల పరిస్థితి విషమంగా మారడంతో భారత్‌- చైనా సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. ('వారి ప్రాణత్యాగం మనోవేదనకు గురి చేసింది')

  

మరిన్ని వార్తలు