మెక్సికో పేలుడులో పెరిగిన మృతుల సంఖ్య

22 Apr, 2016 16:50 IST|Sakshi

కోట్జాకోల్కోస్: మెక్సికో స్టేట్ ఆయిల్ కంపెనీ పెట్రోల్ మెక్సికనోస్లలో బుధవారం సంభవించిన భారీ పెట్రోకెమికల్ పేలుడులో ఇప్పటివరకు మృతి చెందిన కార్మికుల సంఖ్య 24కు పెరిగినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో 19 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 13 మంది పరిస్ధితి విషమంగా ఉంది. కాగా, ఫ్యాక్టరీలోని మరికొన్ని ప్రదేశాల్లో మృతుల కోసం వెతకాల్సి ఉంది.


18 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉందనే యాజమాన్య ప్రకటన అనంతరం దాదాపు 30 కుటుంబాలకు చెందిన వారు ఫ్యాక్టరీలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించి అడ్డుపడ్డ సైనికుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఫ్యాక్టరీ లోపలికి వెళ్లనివ్వకపోవడంతో ఆగ్రహించిన బాధితుల కుటుంబసభ్యులు గేటు ముందే బైఠాయించారు. సెక్యూరిటీ సిబ్బంది ఎంత చెప్పినా వినకుండా అక్కడే కూర్చున్న కుటుంబాలకు కొంతమంది వాలంటీర్లు ఆహారం, నీరు అందించారు. దీంతో దిగొచ్చిన యాజమాన్యం చిన్నచిన్న గ్రూపులుగా కుటుంబసభ్యుల మృతదేహాలను చూసేందుకు లోపలికి అనుమతించింది.


విషపూరిత వాయువులు గాలిలో కలుస్తుండటంతో అధికారులు చుట్టుపక్కల నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉందని పెమెక్స్ డెరెక్టర్ తెలిపారు.

మరిన్ని వార్తలు