కరోనా కేసులు 20,522

5 Feb, 2020 02:39 IST|Sakshi
వుహాన్‌లో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ను తాత్కాలిక ఆస్పత్రిగా మార్చి పడకలను ఏర్పాటుచేసిన దృశ్యం

ఇప్పటివరకు 426 మంది మృతి

చైనాలో కొనసాగుతున్న వైరస్‌ విజృంభణ..

చైనా వెళ్లినవారి వీసాలను రద్దు చేసిన భారత్‌ 

బీజింగ్‌/న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. చైనాలో ఈ వైరస్‌ బారిన పడి మరణించినవారి సంఖ్య 426కి చేరింది. సోమవారం ఒక్కరోజే చైనాలో 64 మంది చనిపోగా, 3235 కొత్త కేసులు, 5072 అనుమానిత కేసులు నమోదయ్యాయి. వైరస్‌ సోకిన వారిలో 492 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 1,71,329 మంది అనుమానితులు ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నారు. చైనాలో ఈ వైరస్‌ బాధితుల సంఖ్య సోమవారం నాటికి 20,522కి చేరింది. వైరస్‌ వ్యాప్తి, కట్టడిని సమీక్షించేందుకు సోమవారం అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అధ్యక్షతన అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ అత్యున్నత పొలిటికల్‌ బ్యూరో సమావేశం జరిగింది. బాధితులకు చికిత్స అందించే విషయంలో, వైరస్‌ను నిరోధించే విషయంలో నిర్లక్ష్యం చూపిన అధికారులను కఠినంగా శిక్షించాలని జిన్‌పింగ్‌ ఆదేశించారు.

భారత్‌ ముందు జాగ్రత్త చర్యలు 
కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే దిశగా భారత్‌ వీసా నిబంధనలను మరింత కఠినం చేసింది. గత రెండు వారాల్లో చైనా వెళ్లిన చైనీయులు, విదేశీయులకు ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. జనవరి 15 తరువాత చైనా వెళ్లి, ప్రస్తుతం సాధారణ వీసా లేదా ‘ఈ–వీసా’పై భారత్‌లో ఉన్న వారు వెంటనే 011–23978046 హాట్‌లైన్‌ నంబర్‌లో కానీ, nఛిౌఠి2019ఃజఝ్చజీ .ఛిౌఝకి ఈమెయిల్‌ చేసి ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించాలని కోరింది. చైనా, సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్‌ దేశాల నుంచి వస్తున్న ప్రయాణీకుల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌ సహా దేశంలోని ఏడు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. వారిని ఆ ఏరోబ్రిడ్జిల ద్వారా తీసుకెళ్లి స్క్రీనింగ్‌ చేయాలని నిర్ణయించారు.

వైరల్‌ అయిన విషాదం
కరోనా వైరస్‌తో బాధపడుతున్న తండ్రి ప్రత్యేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో.. సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడుతూ వీల్‌చెయిర్‌కే పరిమితమైన అతడి  కుమారుడు, ఆహారం అందించి, సాయం చేసే వారు లేని పరిస్థితుల్లో మృత్యువాత పడిన విషాదం చైనాలో చోటు చేసుకుంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న యాన్‌ షియావోవెన్‌ను జనవరి 22న చికిత్సా కేంద్రానికి తరలించారు. జనవరి 27న అతడికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. ఆయన భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. గ్రామంలోని వారి ఇంటివద్ద సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడ్తున్న ఆయన కుమారుడు యాన్‌ చెంగ్‌ మాత్రమే ఉన్నాడు. వీల్‌ చెయిర్‌కే పరిమితమైన చెంగ్‌ సొంతంగా ఏ పనులు చేసుకోలేడు. ఈ నేపథ్యంలో తన కుమారుడికి సాయం చేయాలని బంధువులను, గ్రామస్తులను కోరుతూ షియావోవెన్‌ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టారు. కానీ అప్పటికే ఆలస్యం అయింది. జనవరి 29న యాన్‌ చెంగ్‌ మృతి చెందాడు. ఆయన మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు. అయితే, ఈ ఘటనను హాంగన్‌ కౌంటీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. స్థానిక కమ్యూనిస్ట్‌ పార్టీ సెక్రటరీ, మేయర్‌లపై వేటు వేసింది. ఈ విషాద ఘటన చైనాలో వైరల్‌గా మారింది. ఆ తండ్రి సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌కు 27 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. 

>
మరిన్ని వార్తలు