‘టైమ్‌’ జాబితాలో దీపిక, కోహ్లి, నాదెళ్ల

20 Apr, 2018 02:51 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, దీపికా పదుకోన్, సత్య నాదెళ్ల

మోదీకి తుది జాబితాలో దక్కని చోటు  

న్యూయార్క్‌: ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ 2018 సంవత్సరానికి 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి దీపికా పదుకోన్, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలోని 45 మంది వయసు 40 సంవత్సరాల లోపేనని టైమ్‌ మ్యాగజైన్‌ తెలిపింది. వీరిలో 14 ఏళ్ల నటుడు మిల్లీ బాబీ బ్రౌన్‌ కూడా ఉన్నట్లు వెల్లడించింది.

లింగ సమానత్వం విషయంలో చాలా వెనుకపడి ఉన్నప్పటికీ..  2018 టైమ్‌ జాబితాలో ఎన్నడూ లేనంతగా మహిళలకు చోటు దక్కిందని పేర్కొంది. ఈ సందర్భంగా టైమ్‌ జాబితాలో చోటుదక్కించుకున్నవారి ప్రొఫైల్స్‌ను ఆయా రంగాల్లో ప్రముఖులైన వ్యక్తులు రాశారు. కాగా, టైమ్‌ ప్రాబబుల్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పరిశీలనకు వచ్చినప్పటికీ.. ఆయనకు తుది జాబితాలో మాత్రం చోటు దక్కలేదు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రొఫైల్‌ను మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రాస్తూ.. ‘2008లో అండర్‌–19 ప్రపంచకప్‌కు నేతృత్వం వహిస్తున్న కోహ్లిని తొలిసారి చూశాను.

ఈరోజు విరాట్‌ కోహ్లి అనే పేరు ప్రతి ఇంట్లో సుపరిచితమైపోయింది. కోహ్లిలో పరుగులు సాధించాలన్న కసి, ఆటలో స్థిరత్వం అసాధారణం’ అని చెప్పారు. వెస్టిండిస్‌ పర్యటనలో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న కోహ్లి.. ఆ తర్వాత ఆట, ఫిట్‌నెస్‌లో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకున్నాడని సచిన్‌ ప్రశంసించారు. ట్రిపుల్‌ ఎక్స్‌ జాండర్‌కేజ్‌ చిత్రంలో తనతో కలసి నటించిన బాలీవుడ్‌ నటి దీపిక పదుకోన్‌పై ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విన్‌ డీజిల్‌ ప్రశంసల వర్షం కురిపించారు.

‘పదుకోన్‌ ఇక్కడ కేవలం ఇండియాకు మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లేదు. ఆమె ప్రపంచం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచం ఇప్పటివరకూ అందించిన వాటిలో దీపికే అత్యుత్తమం’ అని ఆమె ప్రొఫైల్‌ రాశారు. ఫ్లిప్‌కార్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సచిన్‌ బన్సల్‌ భవీశ్‌ ప్రొఫైల్‌ రాస్తూ.. ‘దూరదృష్టి, పనిపట్ల మక్కువ, బలమైన సంకల్పంతో భవీస్‌ అడ్డంకులన్నింటినీ అధిగమించారు. కేవలం 32 ఏళ్ల వయసులోనే ఓలాను స్థాపించి 100కు పైగా భారతీయ నగరాల్లో లక్షలాది మంది డ్రైవర్లకు సాధికారత కల్పించారు’ అని చెప్పారు.

సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్లలో కంపెనీ మార్కెట్‌ విలువ 130% పెరిగిందని ఐజాక్‌సన్‌ పేర్కొన్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, హాలీవుడ్‌ నటీమణులు నికోల్‌ కిడ్మన్, వండర్‌ ఉమెన్‌ ఫేమ్‌ గాల్‌ గడోట్, మేఘన్‌ మెర్కెల్‌లతో పాటు బ్రిటన్‌ యువరాజు హ్యారీ, సౌదీ యువరాజు బిన్‌ సల్మాన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా అధినేత కిమ్, కెనడా ప్రధాని  ట్రూడో, ఐర్లాండ్‌కు తొలి గే ప్రధాని వరద్కర్, లండన్‌ మేయర్‌ సాదిక్, ‘మీ టూ’ ఉద్యమకారిణి తరానా బర్క్, బంగ్లాదేశ్‌ ప్రధాని హసీనా, పాప్‌ గాయని జెన్నిఫర్‌ లోపేజ్‌ స్థానం సంపాదించారు.  

మరిన్ని వార్తలు