జుకర్ బర్గ్ దంపతుల సంచలనం : ట్రంప్‌కు షాక్

13 Jun, 2020 14:15 IST|Sakshi
మార్క్ జుకర్ బర్గ్, ప్రిస్కిల్లా చాన్ (ఫైల్ ఫోటో)

 ట్రంప్ వైఖరి తీవ్ర విచారకరం, అసహ్యకరం : మార్క్ దంపతులు

బ్లాక్ లైవ్స్ మేటర్  ఉద్యమానికి జుకర్‌ బర్గ్,చాన్ మద్దతు 

శాన్ ఫ్రాన్సిస్కో: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ప్లాయిడ్ హత్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్  వైఖరిపై  ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా  చాన్  సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్  వైఖరి చాలా విచారకరమైంది, అసహ్యకరమైందంటూ పేర్కొన్నారు. ట్రంప్ మెసేజ్ రెచ్చగొట్టేదిగా ఉందని తాను గానీ, తన పాలసీ టీమ్ గానీ భావించడంలేదని  ఇప్పటిదాకా సమర్ధించిన  మార్క్ తాజాగా  వివాదాస్పద పోస్టులపై  మొట్టమొదటి సారి ప్రత్యక్షంగా ఘాటు విమర్శలు చేయడం గమనార్హం. 

చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ కు నిధులు సమకూర్చిన 270 మంది శాస్త్రవేత్తలు ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లపై తప్పుడు సమాచారం, ద్వేషపూరిత పోస్ట్‌లను అరికట్టాలంటూ డిమాండ్ చేశారు. ట్రంప్ పోస్ట్ హింసను ప్రేరేపించే స్పష్టమైన ప్రకటన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలకు సమాధానమిస్తూ తమ దేశ చరిత్రలో  అసాధారణమైన, బాధాకరమైన ఇన్‌ఫ్లేషన్ సమయమని మార్క్ దంపతులు వ్యాఖ్యానించారు.  జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ట్రంప్ చేసిన బాధాకరమైన వ్యాఖ్యలు తమను కదిలించాయని పేర్కొన్నారు. దేశానికి చాలా ఐక్యత అవసరమైన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ విభజన వాదం విచారకరమంటూ వీరు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే  ఫేస్‌బుక్, చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ రెండూ వేర్వేరు సంస్థలని తెలిపారు. (ఉద్యోగిపై వేటు : ఫేస్‌బుక్‌తో విసిగిపోయా!)

అలాగే ట్రంప్ పోస్ట్ ను తొలగించకపోవడంపై స్పందిస్తూ సైన్యాన్ని మోహరిస్తామన్న ట్రంప్  హెచ్చరికలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే అలా ఉంచామని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఫ్లాయిడ్ మరణం తరువాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మేటర్  ఉద్యమానికి జుకర్‌ బర్గ్, చాన్ మద్దతు తెలపడం విశేషం.

మరిన్ని వార్తలు