సిక్కిం బెస్ట్.. ఢిల్లీ వరస్ట్...!

21 Sep, 2016 18:24 IST|Sakshi

వాషింగ్టన్ః ఉద్యోగినులకు సిక్కిం బెస్ట్ ప్లేస్ అని, ఢిల్లీ వరస్ట్ ప్లేస్ అని అమెరికా వెల్లడించిన తాజా నివేదికలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా పనిచేసేచోట మహిళలకు ఇండియాలోనే ఢిల్లీ నగరంలో పని పరిస్థితులు చెత్తగా ఉన్నాయని తెలిపింది. అంతేకాక ప్రపంచంలోనే మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యంలో ఇండియా 24 శాతంతో చివరిస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్), టాప్ అమెరికన్ థింక్ ట్యాంక్, నేథన్ అసోసియేట్స్ సంయుక్తంగా వెల్లడించిన నివేదికలో సిక్కిం 40 పాయింట్లలో ముందు స్థానంలో నిలువగా... రెండో స్థానంలో తెలంగాణ ఉన్నట్లు తేలింది. ఢిల్లీ కేవలం 8.5 పాయింట్లను పొంది నేర చరిత్రకు నెలవైన రాష్ట్రంగా ప్రతిబింబిస్తున్నట్లు నివేదికలో పేర్కొంది.

ప్రధానంగా నాలుగు కారణాలను దృష్టిలో పెట్టుకొని ఆమెరికా ఈ హోదాలను నిర్ణయించింది. ఫ్యాక్టరీల్లో మహిళల పనిగంటలపై చట్టబద్ధమైన ఆంక్షలు, పని వేళల్లో మహిళలపై లైంగిక వేధింపులు, రాష్ట్రంలో నేర న్యాయ వ్యవస్థ ప్రభావం,  మహిళా కార్మికుల సంఖ్య, ప్రోత్సాహకాలు వంటి  విషయాలను పరిశీలించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల్లో మహిళాభాగస్వామ్యం అధికంగా ఉండటం, మహిళల పని గంటలపై ఆంక్షలు లేకపోవడం, మహిళా కార్మికులపై నేరాల రేటు తక్కువగా ఉన్న సిక్కిం.. చిన్న రాష్ట్రమైనా  స్త్రీ పురోగతికి నిలయంగా నిలిచినట్లు నివేదికల్లో వెల్లడించింది. అలాగే సిక్కిం, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడుల్లోని  కర్మాగారాలు, ఐటీ రంగంలో రాత్రిసమయంలో పనిచేసే మహిళా కార్మికులపై కోర్టు ఆదేశాల మేరకు అన్ని పరిమితులు ఎత్తివేసినట్లు తెలిపింది. అయితే మహరాష్ట్ర మాత్రం కొన్నిరంగాల్లో రాత్రి పది వరకూ మహిళలతో పని చేయించడంతో.. సరైన స్కోర్ సంపాదించలేకపోయినట్లు నివేదిక చెప్తోంది.

మరోవైపు తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసలు మహిళలను నైట్ షిఫ్టులకు అనుమతించడం లేదు. మరో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహిళా పారిశ్రామిక వేత్తలకు తమ వ్యాపారాభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడం లేదు. ముఖ్యంగా భారత రాజధాని నగరం ఢిల్లీలో ఇటు మహిళలకు భాగస్వామ్యం కల్పించకపోవడంతోపాటు, మహిళలపై వేధింపులు, నేరాలు అధికంగా ఉండటం, పారిశ్రామిక వేత్తలకు ప్రోత్పాహకాలు కల్పించకపోవడంతో జాబితాలో నగరం అట్టడుగు స్థాయికి చేరుకున్నట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది. దీనికి తోడు మహిళా భాగస్వామ్యంలో ఇండియా ప్రపంచంలోనే అతి తక్కువ స్థానంలో ఉంది. ముఖ్యంగా పని ప్రాంతాల్లో భారత మహిళలు అధికంగా వేధింపులు ఎదుర్కొంటున్నారని మెక్ కిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ అంచనాలు చెప్తుండగా... ఈ ప్రభావం మహిళాభివృద్ధికి తీరని ఆటంకంగా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు