ఒబామాకు ‘మధ్యంతర’ షాక్

5 Nov, 2014 22:23 IST|Sakshi
ఒబామాకు ‘మధ్యంతర’ షాక్
  • ఇక రెండేళ్ల పదవీకాలంలో అధ్యక్షుడికి గడ్డుకాలమే!
  • వాషింగ్టన్: అమెరికా పార్లమెంటు ఉభయసభలకు జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు బరాక్ ఒబామాను, అధికార డెమొక్రాటిక్ పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లోని 36 స్థానాలకు(మొత్తం 100 సీట్లు), మొత్తం 50 రాష్ట్రాలకు గానూ.. 36 రాష్ట్రాల్లో గవర్నర్ పోస్ట్‌లకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ప్రతినిధుల సభ, సెనెట్.. రెండింటిలోనూ రిపబ్లికన్లు ఆధిపత్యం సాధించారు. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు 235 సీట్లు దక్కించుకోగా.. డెమోక్రాట్లు 157 స్థానాలకే పరిమితమయ్యారు. ఎన్నికలకు ముందు ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 199, డెమోక్రాట్లకు 233 స్థానాలు ఉన్నాయి. సెనెట్‌లో రిపబ్లికన్లు 52 సీట్లలో, డెమోక్రాట్లు 43 స్థానాల్లో గెలుపొందారు.

    సెనేట్‌లో రిపబ్లికన్లు మెజారిటీ పెంచుకోవడం.. గడిచిన ఎనిమిదేళ్లలో ఇది తొలిసారి. కెంటకీకి చెందిన సెనేటర్ మిచ్ మెక్‌కొనెల్.. సెనేట్ మెజారిటీ లీడర్ హోదాను చేజిక్కించుకుని తన కలను సాకారం చేసుకోనున్నారు. నార్త్ కరోలినా, ఆర్కన్సాన్, కొలరాడోలలో అధికార డెమోక్రాట్ల సీట్లను రిపబ్లికన్లు చేజిక్కించుకున్నారు.  అత్యంత పోటీ ఉన్న ప్రతిష్టాత్మక అయోవో సెనేట్ సీటును రిపబ్లికన్ అభ్యర్థి జోనీ ఎర్నెస్ట్ దక్కించుకోవడం గమనార్హం. గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రాట్లకు పట్టున్న మేరీలాండ్, ఇలినాయిస్‌లలో రిపబ్లికన్లు ఘన విజయం సాధించారని విశ్లేషకులు చెబుతున్నారు.
     
    డెమోక్రాట్లకు శరాఘాతం: అధికార డెమోక్రాట్లకు తాజా ఫలితాలు మింగుడుపడడం లేదు. ఒబామా రెండేళ్ల పదవీ కాలంలో తలపెట్టే కీలక పాలనా యంత్రాంగ సంస్కరణలు ఆమోదం పొందడం ఇక కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఒబామాను చాలా మంది కుంటి బాతుగా పిలవడం మొదలుపెట్టారు. రెండేళ్ల పదవీ కాలంలో ఒబామా ఇక గడ్డుకాలాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది.
     

మరిన్ని వార్తలు