'గే మ్యారేజ్ లైసెన్సా.. చస్తే ఇవ్వను'

7 Jul, 2015 18:47 IST|Sakshi
'గే మ్యారేజ్ లైసెన్సా.. చస్తే ఇవ్వను'

వాషింగ్టన్: అమెరికాలో స్వలింగ వివాహాలకు ఆ దేశ సుప్రీంకోర్టు చట్టబద్ధత కల్పించినప్పటికీ అమలులో మాత్రం అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. తాజాగా 27 ఏళ్లుగా సహజీవనం చేస్తోన్న ఇద్దరు గేలు మ్యారేజ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే 'లైసెన్స్ జారీ చేసేది లేదు' అంటూ ఓ అధికారిణి తేల్చిచెప్పింది. దీంతో ఆమెపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సదరు గేలు. వివరాలు..

టెక్సాస్ రాష్ట్రంలోని హుడ్కౌంటీకి చెందిన జిమ్ కాటో, జో స్టాపెలటన్ 27 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. జూన్ 30న అమెరికా సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇవ్వడంతో తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకోవాలని భావించి, సమీపంలోని రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడి క్లర్కు కేట్ లాంగ్.. గే మ్యారేజ్ లైసెన్స్ మంజూరీకి నిరాకరించింది. పైగా ''ఆడ, మగ పెళ్లి చేసుకోవడమొక్కటే ప్రకృతి ధర్మం. గే, లెస్బియన్స్ వివాహాలను మతం అంగీకరించదు'' అని జిమ్, జోలకు క్లాస్ పీకింది.

దీంతో చిర్రెత్తుకొచ్చిన గే జంట.. కోర్టును ఆశ్రయించింది. మరో ప్రయత్నంగా జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. స్పందించిన అధికారులు అక్కడిక్కడే వారికి మ్యారేజ్ లైసెన్స్ మంజూరు చేశారు. అయితే కింది ఆఫీసులో తమ వివాహం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి, అవమానించిన క్లర్కు కేట్ తీరు మార్చుకునే వరకు దావాను వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేశారు జిమ్, జోల తరఫు న్యాయవాది.

మరిన్ని వార్తలు