తన నుంచి శాశ్వతంగా వేరు చేయండి

2 Jun, 2020 20:09 IST|Sakshi

వాషింగ్టన్‌ : నల్ల జాతీయుడు జార్జ్‌ ప్లాయిడ్‌ మరణానికి కారణమైన పోలీస్‌ అధికారి డెరెక్ చౌవిన్ భార్య కీలై చౌవిన్ మరోసారి కోర్టుకెక్కారు. జార్జ్‌ను అత్యంత అమానుషంగా మోకాలితో మెడపై నొక్కి పట్టి అతని మృతికి కారణమైన డెరెన్‌ నుంచి విడాకులు కోరుతూ ఇప్పటికే ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా తన పేరులోని చివరి పదమైన చౌవిన్‌ను తొలగించాలని ఓ పిటిషన్‌ వేశారు. అలాగే విడాకుల పత్రాల్లోనూ ఆ పదం ఉండకూడదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే తనతో పూర్తి సంబంధాలు తొలగిపోయాయని పేర్కొన్నారు. ఇకపై తాను కేవలం కీలైగానే పిలవబడతానని స్పష్టం చేశారు. అలాగే ఇప్పటి వరకు ఇద్దరి పేరుమీదా ఉన్న ఆస్తులను ఇరువురికి సమానంగా వచ్చే విధంగా పంచాలని కూడా ఆమె పిటిషన్‌లో కోరారు. విడాకుల అనంతరం తాన కాళ్ల మీద తాను ఒంటరిగా జీవిస్తానని, తన నుంచి శాశ్వతంగా వేరు చేయాలని తెలిపారు. (ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికా)

డెరెక్ చౌవిన్-కీలై చౌవిన్ 2010లో వివాహం చేసుకున్నారు. కాగా జార్జ్‌ మృతికి కారణమైన పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను తక్షణమే ఉరి తీయాలంటూ దేశ వ్యాప్తంగా పౌరులు నినదిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చౌవిన్‌‌పై హత్యా కేసును నమోదు చేసిన ప్రభుత్వం కటకటాల వెనక్కి పంపింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే  విడాకులు కోరుతూ కీలై కోర్టుకెక్కారు.  నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ, మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటనకు పాల్పడిన చౌవిన్‌తో తన వివాహాన్ని రద్దు చేయాలని ఆమె కోరారు. (విడాకులకు దారి తీసిన నల్లజాతీయుడు మృతి)

మరిన్ని వార్తలు