ప్రయోగాల కోసం ఓ నిర్మానుష్య ప్రయోగం

3 Oct, 2016 02:44 IST|Sakshi
ప్రయోగాల కోసం ఓ నిర్మానుష్య ప్రయోగం

అమెరికాలోని న్యూ మెక్సికో సరిహద్దుల్లో కొత్తగా ఓ టౌన్‌షిప్‌ను కట్టేస్తున్నారు. దాదాపు 35 వేల మందికి  సరిపడా ఇళ్లు, రోడ్లు, ఆఫీసు బిల్డింగ్‌లు, హైవే... వంటి అన్ని హంగులూ ఉంటాయి దీంట్లో. అయితే ఏంటట? ఇదో కొత్త రియల్ ఎస్టేట్ వెంచరో, గేటెడ్ కమ్యూనిటీ టైపో అయివుంటుందని అనుకుంటున్నారా? అక్కడే ఉంది మెలిక. దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ టౌన్‌షిప్‌లో మనిషన్నవాడు ఉండడు!! ఆశ్చర్యపోకండి! ఇంత డబ్బు పోసి దీన్ని కడుతోంది రేపటితరం టెక్నాలజీలను పరీక్షించేందుకట! పెగసస్ గ్లోబల్ హోల్డింగ్ అనే సంస్థ దీన్ని నిర్మిస్తోంది.
 
 టౌన్‌షిప్ పేరు.. సెంటర్ ఫర్ ఇన్నొవేషన్, టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్. మొత్తం 15 చదరపు మైళ్ల విస్తీర్ణంలో కడుతున్న ఈ టౌన్‌షిప్‌లో హైటెక్ రవాణా వ్యవస్థ (డ్రైవర్లు లేనివి, ఇతరత్రా)తోపాటు, కొత్తకొత్త సంప్రదాయేతర ఇంధన వనరులు (సోలార్, జియోథర్మల్ వంటివి), స్మార్ట్ గ్రిడ్, టెలీకమ్యూనికేషన్స్, సెక్యూరిటీ, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే నిర్లవణీకరణ వంటి అనేక టెక్నాలజీలపై రిమోట్‌గా (టౌన్‌షిప్ బయటనుంచి) ప్రయోగాలు జరుగుతాయి. మనుషులుంటే వారి భద్రత తదితర అంశాలు ఈ ప్రయోగాలకు అడ్డంకిగా మారతాయని కంపెనీ భావిస్తోంది.
 
అందుకే నిర్మానుష్యమైన నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ప్రయోగ ఫలితాలతో అమెరికా ఆయా రంగాల్లో సరికొత్త ఇన్నొవేషన్స్ చేయగలదని, అంతేకాకుండా సుక్షితులైన పనిమంతులూ దొరుకుతారని పెగసస్ అంచనా వేస్తోంది. కరెంటు, నీళ్లు, ఇంటర్నెట్, మురుగునీటి సౌకర్యం వంటివి టౌన్‌షిప్‌లో ఉన్న అన్ని బ్లాకులకు అందేలా బ్యాక్‌బోన్ వ్యవస్థ ఒకటి ఉంటుంది.

దీన్ని బ్యాక్‌బోన్ హబ్ ద్వారా పర్యవేక్షిస్తూంటారు. ప్రయోగాలు నిర్వహించేందుకు ఈ టౌన్‌షిప్ సరిహద్దుల్లో ఓ భారీ భవనాన్ని కూడా కడుతున్నారు. దీన్ని సిటీ క్యాంపస్ అని పిలుస్తున్నారు. రిమోట్‌గా పనిచేసే శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు అందరూ దీంట్లో ఉంటారుగానీ.. టౌన్‌షిప్‌లోకి మాత్రం అడుగుపెట్టరన్నమాట. ఇంకో విషయం... ఈ టౌన్‌షిప్ నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకోసం కొన్ని వందల మంది కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నట్లు పెగసస్ అంటోంది.

మరిన్ని వార్తలు