అందరికీ జాగ్రత్తలు చెప్పి.. చివరికి మహమ్మారికే..

6 Apr, 2020 12:49 IST|Sakshi

కరోనాతో అమెరికా డ్రైవర్‌ మృత్యువాత

విధుల్లో అందరినీ అప్రమత్తం చేసిన వైనం

డెట్రాయిట్‌: దగ్గినపుడు లేదా తుమ్మినపుడు నోటికి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. అది అందుబాటులో లేనిపక్షంలో మోచేతిని మడిచి నీటి తుంపరలు గాల్లో ప్రవేశించకుండా జాగ్రత్తలు పాటించాలి.. ఇటువంటి మంచి అలవాట్ల గురించి ఎంతో మంది ఎన్నిసార్లు చెప్పినా.. ప్రాణాంతక వైరస్‌ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరు ఇప్పుడు దీనిని విధిగా పాటిస్తున్నారు. ప్రాణం మీద తీపి ఉన్నవాళ్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు స్థానిక ప్రభుత్వాలు చేస్తున్న సూచనలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అయితే చాలా మంది ప్రవర్తన ఇందుకు భిన్నంగా ఉంది. మహమ్మారి ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా.. తమకేమీ పట్టనట్టు ఇష్టారీతిన వ్యవహరిస్తూ.. తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కొంతమంది వ్యక్తుల కారణంగా అమెరికాలో ప్రజా రవాణా సంస్థకు చెందిన ఓ డ్రైవర్‌ కన్నుమూశారు. కరోనాపై మంచి అలవాట్లతో పోరాడాలని చెబుతూ చివరకు ఆ మహమ్మారికే ఆయన బలయ్యారు.(కరోనా బారిన పడ్డ డాక్టర్‌ ఆత్మహత్య!)

వివరాలు... డెట్రాయిట్‌కు చెందిన జాసన్‌ హార్గ్రోవ్‌ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు మొదలైన తరుణంలో మార్చి 21 ఆయన ఫేస్‌బుక్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. ‘‘ఆరోగ్య సంస్థలు, నిపుణులు మోచేతిని మడిచి దగ్గాలి. టిష్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకుని తుమ్మాలి అని పదే పదే చెబుతున్నారు. అయితే కొంత మంది బస్సు ఎక్కేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నా బస్సు ఎక్కిన ఓ మహిళ నోటికి ఏమీ అడ్డుపెట్టుకోకుండానే తుమ్మడం, దగ్గడం గమనించాను. వెంటనే ఆమెను అప్రమత్తం చేశాను. మీతో పాటు ఇతరులకు కూడా మీ చెడుఅలవాట్లు హాని చేస్తాయని చెప్పాను. నిబంధనలు అల్లంఘించిన వారికి ఇలా చెప్పడంలో తప్పులేదని భావిస్తున్నా స్నేహితులారా’’అని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.(కరోనా సంక్షోభం: ఐరిష్‌ ప్రధాని కీలక నిర్ణయం!

ఈ క్రమంలో వీడియో పోస్ట్‌ చేసిన పదకొండు రోజులకే కరోనా బారిన పడి జాసన్‌ న్నుమూశారు. ఆయన మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన డెట్రాయిట్‌ మేయర్‌.. ‘‘అమెరికాలోని ప్రతీ ఒక్కరు ఈ వీడియో చూడాలి’’ అని విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మహమ్మారి బారి నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. కాగా అమెరికాలో కరోనా విలయతాండం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ 10 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించగా.. లక్షలాది మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇక కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నా.. ​కొన్ని దేశాల్లో పౌరులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. (అక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేస్తారంటే!2)

మరిన్ని వార్తలు