రక్తం.. నిజంగానే ఏరులై పారింది!

14 Sep, 2016 19:15 IST|Sakshi
రక్తం.. నిజంగానే ఏరులై పారింది!

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో రక్తం ఏరులై పారింది. బక్రీద్ సందర్భంగా వేలాది మేకలు, గొర్రెలు, ఆవులను అక్కడ నరికేశారు. వాటి రక్తానికి వర్షపు నీరు కూడా తోడవడంతో ప్రధానమైన రోడ్లన్నీ ఎర్రగా మారిపోయాయి. అసలే అక్కడి డ్రైనేజి వ్యవస్థ అంతంతమాత్రంగా ఉండటంతో.. జంతువుల రక్తం వర్షపునీళ్లతో కలిసి రోడ్లమీద పారింది. జంతువుల వ్యర్థాలు కూడా ఆ నీళ్లలో తేలియాడుతూ వచ్చాయి. వీటికి సంబంధించిన పలు ఫొటోలను ఢాకావాసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను పోస్టుమార్టం చేసిన ప్రాంతం గుండా వెళ్తున్నట్లు అనిపించిందని ఢాకాకు చెందిన అతిష్ సాహా అనే కళాకారుడు చెప్పారు. తాను నిజంగా చాలా భయపడిపోయానని, ఇది సామూహిక హింసకు ప్రతీకలా కనిపించిందని.. ఇలాంటివి జరగకూడదని అన్నారు.

నిజానికి జంతువులను నరకడానికి తాము వందకు పైగా ప్రాంతాలను గుర్తించామని, అక్కడైతే వాటి రక్తంతో పాటు వ్యర్థాలను కూడా సులభంగా శుభ్రం చేయొచ్చని అధికారులు చెప్పారు. అయితే ప్రజలు మాత్రం దాదాపు లక్ష వరకు జంతువులను ఈ ఏడాది బలిచ్చారని బీబీసీ తెలిపింది. అదికూడా చాలావరకు వీధుల్లోను, తమ ఇళ్లలోని అండర్‌గ్రౌండ్ గ్యారేజిలలోను నరికారని అంటున్నారు. బుధవారం నాడు ఢాకాలో ఏ వీధి చూసినా రక్తం పారుతూనే కనిపించింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు