అసలే 13...ఆపైన శుక్రవారం

13 Apr, 2018 13:47 IST|Sakshi
13వ తేదీ శుక్రవారం (ఫైల్‌ ఫోటో)

జనాలకు కొన్ని వింత నమ్మకాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లి ఎదురొచ్చినా, ఎవరైనా తుమ్మినా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం వంటివి. ఇలానే ప్రజల్లో ఇంకా చాలా మూఢ నమ్మకాలే ఉన్నాయి. ఒక్కోసారి ఏమైనా సంఘటనలు యాధృచ్చికంగా ఏర్పడినా..  అవి ఈ మూఢ నమ్మకాల వల్లే ఏర్పడ్డాయని కొందరు భావిస్తుంటారు. ఇలాంటి నమ్మకాల వల్ల కొన్ని సార్లు మంచి జరుగుతుంది, కొన్ని సార్లు చెడు జరుగుతుంది. అలాంటి ఒక వింత నమ్మకమే 13ను దురదృష్టంగా భావించడం. అవును ప్రపంచంలో చాలా దేశాల్లో 13ను దురదృష్ట సంఖ్యగా నమ్ముతారట. అలాంటి 13 వ తారీఖు కనుక శుక్రవారం వస్తే దానంత దరిద్రమైన రోజు మరొకటి ఉండదని అనుకుంటారట. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఈ రోజు శుక్రవారం 13వ తేదీ.  

13వ తేదీని ఎందుకు దురదృష్ట సంఖ్యగా చెబుతారో సరైన కారణాలు తెలియదు కానీ, ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే.. ఏసు క్రీస్తును సిలువ వేయడానికి ముందు రోజు జరిగిన ముఖ్య ఘట్టం లాస్ట్‌ సప్పర్‌. దీనిలో పాల్గొన్నవారు 13 మంది. ఆ మరుసటి రోజు అనగా శుక్రవారం క్రీస్తును సిలువ వేశారు. ఆ రోజున ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. ఇటువంటి బాధకరమైన సంఘటనలు జరిగాయి కాబట్టే ఏ నెలలోనైనా ఈ రెండు కలిసి వస్తే అంటే 13వ తేదీ శుక్రవారం వస్తే ఆ రోజు తప్పకుండా ఏదైనా చెడు జరుగుతుందని బఫ్ఫేలోని ఓ విశ్వవిద్యాలయంలో ఆంత్రాపాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఫిల్‌ స్టివెన్స్‌ తెలిపారు. ఏజేసీ.కామ్‌లోని యూదుల ఇస్కారియట్‌ ప్రకారం క్రీస్తును మోసం చేసి సైనికులకు అప్పగించిన శిష్యుడు భోజన బల్ల వద్ద 13వ స్థానంలో కూర్చున్నాడని.. అందుకే 13 అనే అంకెను చెడు సంఖ్యగా భావిస్తారని తెలిసింది.

కారణాలు ఏవైనా చాలా మంది మాత్రం 13 సంఖ్యను దురదృష్టంగా భావిస్తారు. ఆ తేదీన ఎవ్వరూ గృహప్రవేశం చేయరు. పెద్ద పెద్ద భవనాలలో కూడా 13వ నంబరు అంతస్తు ఉండదు. ఒకవేళ 13వ అంతస్తు ఉన్నా.. ఆ మొత్తం అంతస్తును ఖాళీగా ఉంచుతారు. ఆ రోజున ఎవరూ వివాహం కూడా చేసుకోరు. గతంలో కూడా 13వ తేదీ శుక్రవారం వచ్చిన సందర్భాల్లో అనేక అనూహ్యమైన చెడు సంఘటనలు సంభవించాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే కొంతమంది 13వ తేదీ, శుక్రవారం రెండు కలసిరావడం చాలా అదృష్టంగా భావిస్తారట. ఏదైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటుందని, కాబట్టి ఈ రోజంతా మంచి జరగాలని ఆశించి, రోజు చివరలో ఏం జరిగిందో విశ్లేషించుకోండని అంటున్నారు న్యూమరాలజిస్ట్‌లు. మరో విషయం ఏంటంటే నేడు శుక్రవారం 13వ తేదీ అనంతరం ఈ ఏడాదిలో జూలై నెలలో కూడా 13వ తేదీ శుక్రవారంతో కలిసి రాబోతోంది. మరి ఈ రెండు రోజుల్లో ఏమైనా వింత విశేషాలు జరుగుతాయేమో చూడాలి.

మరిన్ని వార్తలు