బతికున్న తాబేలు కీచైన్‌లు..

10 Aug, 2015 11:37 IST|Sakshi
బతికున్న తాబేలు కీచైన్‌లు..

సాక్షి: కొన్ని దేశాల పేర్లు చెబితే అక్కడ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, వస్తువులు, కట్టడాలు గుర్తుకురావడం సహజం. అలాగే చైనా పేరు చెబితే గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా, నెల రోజుల పాటు జరిగే నూతన సంవత్సర వేడుకలు.. లాంటివి గుర్తుకు వస్తాయి. కానీ వీటికి మించిన ప్రత్యేకత లు చైనా షాపింగ్‌లో ఉన్నాయి. ఆ ప్రత్యేకతలేమిటో, ఆ షాపింగ్ విశేషాలేమిటో ఈ రోజు తెలుసుకుందాం..!

వెరై 'టీ'..
చైనాలో పాండా డంగ్ టీ ప్రత్యేకమని తెలుసు. దాని తర్వాత ఇక్కడ మరో టీ కూడా ప్రసిద్ధి. ఎందుకంటే ఇది పెళ్లికాని అమ్మాయిలు నోటితో తీసిన టీ. చాలా వింతగా అనిపిస్తుంది కదూ! కాని అక్కడ ఒక టీ కంపెనీ అవలంభిస్తున్న వ్యాపార టెక్నిక్ ఇది. ఇందులో పెళ్లి కాని అమ్మాయిలను మాత్రమే పనికి తీసుకుంటారు. ఆ అమ్మాయిలు టీ ఆకులను తమ చేతితో కోయరు. నోటితో కత్తిరిస్తారు. ఆకులు వేసుకునే బుట్టను కూడా చేతితో పట్టుకోకుండా మెడలో తగిలించుకుంటారు. ఈ కంపెనీ తయారు చేసే టీకి చైనాలో చాలా డిమాండ్ ఉంది.

రోబోలు తయారు చేసే ఆహారం..
నూడుల్స్ నుంచి చిల్లీ చికెన్ వరకు రోబోలు తయారుచేసే ఆహారం చాలా రుచిగా ఉంటుందట. రోబో చేతులకున్న మెటాలిక్ వేళ్లు ఆహారానికి కొత్త రుచిని చేకూరుస్తున్నాయని అంటున్నారు. 2011లో క్యురన్‌కాన్ అనే వ్యక్తి ప్రయోగాత్మకంగా వంటచేసే రోబోలను తయారు చేశాడు. అది విజయం సాధించడంతో రోబో వంటను అందించే అనేక రెస్టారెంట్లు వెలిశాయి. ప్రజలు కూడా వీటికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అతడు ఒక్కో రోబోను రూ. 1,50,000 కు విక్రయించాడు.

డబ్బాల గాలి..
చైనాలో వాతావరణ కాలుష్యం అక్కడి ప్రజలను అనారోగ్య సమస్యలకు గురిచేస్తోంది. దీన్ని సొమ్ము చేసుకోవాలని కొన్ని కంపెనీలు స్వచ్ఛమైన గాలిని డబ్బాలలో బంధించి అమ్ముతున్నాయి. మిలియనీర్లు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. మనం స్వచ్ఛమైన నీటికి డబ్బులు ఖర్చుపెట్టినట్టు చైనా వాసులు ఇప్పుడు స్వచ్ఛమైన గాలికోసం ఎక్కువగా ఖర్చుచేస్తున్నారట.

మరుగుజ్జు పార్కు..
చైనాలో మరుగుజ్జులందరినీ ఒక చోటికి తరలించారు. సుమారు 13,000 ఎకరాల విస్తీర్ణంలో వారికి అన్ని వసతులు కల్పించి, దాన్ని ఒక ప్రత్యేక పార్కుగా మార్చేశారు. అక్కడి ప్రజలతో పాటు, పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి వీరితో కాసేపు సరదాగా గడపొచ్చు.
 

బతికున్న తాబేలు కీచైన్‌లు..
మీరు చాలా రకాల కీచైన్‌లను వాడుంటారు. బతికున్న జీవులను ఎప్పుడైనా కీచైన్‌లుగా ఉపయోగించారా.. ఇలాంటి సరదా తీరాలంటే చైనాలో షాపింగ్ చేయాల్సిందే. ఒక ప్లాస్టిక్ కవరులో కావలసిన ఆక్సిజన్, విటమిన్లు ఉన్న నీటిని నింపి అందులో తాబేలు వంటి చిన్న చిన్న జీవులను ఉంచి, వాటిని కీ చైన్లుగా అమ్ముతారు. కొందరు వీటిని అదృష్టంగా భావించి కొంటుంటే, మరికొందరు ఆ అమాయక జీవులకు స్వేచ్ఛ కల్పించడానికి కొంటున్నారు.

ట్రాఫిక్ జాం నుంచి తప్పిస్తారు..
జనాభాలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్న చైనాలో ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణం. ఒక్కోసారి అవి క్లియర్ అవడానికి గంటల నుంచి రోజుల సమయం పట్టొచ్చు. ఇలా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన వారి కోసం ఒక ప్రైవేటు కంపెనీ ప్రత్యేక సర్వీసును ప్రారంభించింది. వారికి ఫోను చేస్తే వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వ్యక్తిని బైక్‌పై ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానం చేరుస్తారు. కారును కూడా ట్రాఫిక్ తగ్గాక వారే తెచ్చి ఇంటి దగ్గర అందచేస్తారు. దీనికి తగిన రుసుము చెల్లించాలి.

మరిన్ని వార్తలు