చేతులు లేకుంటేనేం..

26 May, 2019 19:07 IST|Sakshi
అడ్రియానా మాకియస్

చేతులు లేకుంటేనేం.. ఆత్మస్థైర్యం, ఏదో సాధించాలనే కసి ఆమెను ముందుకు నడిపించాయి. లా డిగ్రీ అర్హతతో ఉద్యోగం కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమెకు నిరాశే ఎదురైంది. దానికి ఆమె నిరుత్సాహపడలేదు. ఉద్యోగం అని తిరిగితే పనికాదు.. ఇక ఏదో ప్రత్యేకమైన కెరీర్‌ను ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. మోటివేషనల్‌ స్పీచ్‌లు ఇవ్వడం, రాయడం మొదలు పెట్టింది. కొన్నాళ్లకు ఆ పని కూడా బోర్‌ కొట్టింది. ఫ్యాషన్‌ డిజైన్‌ రంగంవైపుకు అడుగేసింది. అది నచ్చింది. అంతే ఇక ఆమెకు తిరుగులేదు. ఆ రంగంలో తనదైన ముద్రవేసింది. ప్రస్తుతం మెక్సికోలోని గ్వాడలజరాలో విజయవంతమైన ఫ్యాషన్‌ డిజైనర్‌గా దూసుకెళ్తుంది. 

ఆమె పేరు అడ్రియానా మాకియస్. పుట్టకతోనే రెండు చేతులు లేవు. అయినా అడ్రియానా ఎప్పుడు బాధపడలేదు. గత నెల మెక్సికోలో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌లో అడ్రియానా డిజైన్‌ చేసిన దుస్తులను దివ్యాంగ మోడల్స్‌ ప్రదర్శించారు. వాటికి ఆదరణ లభించి అడ్రియానాకు మంచి గుర్తింపు లభించింది. ధరించే దుస్తులు వ్యక్తులను డామినేట్‌ చేయవద్దని, దుస్తులను ధరించే వ్యక్తులు డామినేట్‌ చేయాలంటుంది అడ్రియానా. అందుకే తాను సౌకర్యవంతమైన, ఫార్మల్‌ దుస్తులను మాత్రమే డిజైన్‌ చేస్తానని చెప్పుకొచ్చింది. 41 ఏళ్ల వయసున్న అడ్రియానకు చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రలు కాళ్లతో పనిచేయడం నేర్పించారు.

ఇప్పుడు ఆమె ఎవరి సహాయం లేకుండా తన కాళ్లతో తినగలదు.. రాయగలదు.. వంట కూడ చేయగలదు. చివరకు తన డిజైన్స్‌ దుస్తులు కూడా కుట్టగలదు. 20 ఏళ్ల వయసు వరకు కృత్రిమ చేతులు ఉపయోగించిన అడ్రియాన.. వాటి బరువు వల్ల భుజాల్లో కలిగిన నొప్పితో తీసేసింది. కృత్రిమ చేతులు లేకుండా యూనివర్సిటీకి వెళ్లడం చాలా కష్టంగా ఉండేదని, క్లాస్‌లో షూస్‌ తీసి రాయడం మరింత కష్టంగా అనిపించేదని చెప్పుకొచ్చింది. ఇక అడ్రియానా జీనియస్‌ వరల్డ్‌ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఒక నిమిషంలో కాళ్లతో ఎక్కువ బర్త్‌డే క్యాండిల్స్‌ వెలిగించిన వ్యక్తిగా గుర్తింపు పొందింది.

మరిన్ని వార్తలు