వేలానికి డైనోసార్‌ ..!

11 Apr, 2018 11:42 IST|Sakshi

డైనోసార్ల అస్థిపంజరాలు... పారిస్‌లో  వేలానికి సిద్ధమవుతున్నాయి. ఇంత పెద్ద సైజులో ఉన్న ఈ అస్థిపంజరాలు ఎవరైనా కొంటారా? అనుకుంటున్నారా... వీటికున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ప్రసిద్ధ హాలీవుడ్‌ నటులు లియోనార్డో డికాప్రియా, నికోలాస్‌ కేజ్‌ వంటి వారు ఇలాంటివి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా బుధవారం జరిగే వేలంలో జూరాసిక్,క్రెటాషియస్‌ కాలానికి చెందిన ‘అలోసౌరుస్‌’ డైనోసార్, ఆ తర్వాతి కాలానికి చెందిన అతి పొడవైన మెడ, తోకలతో పాటు మొత్తం 12 మీటర్ల మేర  శరీరం కలిగిన ‘డిప్లోడోకస్‌’ డైనోసార్‌  అస్థిపంజరాలు ఉంచుతారు. ఇలాంటి శిలాజాల మార్కెట్‌ కేవలం సైంటిస్టులకే పరిమితం కావడం లేదని, పెయింటింగ్స్‌ మాదిరిగా  వస్తువుల అలంకరణకు డైనోసార్ల అస్థిపంజరాలుంచడం ఇప్పుడు ట్రెండీగా మారిందని ఈ వేలాన్ని నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధి ఐయాకొపొ బ్రియానో వెల్లడించారు.

గత రెండు,మూడేళ్లుగా డైనోసార్ల నమూనాల కోసం చైనీయులు ఎక్కువ అసక్తి చూపుతున్నారని, తమ మ్యూజియంలతో పాటు వ్యక్తిగత కలెక్షన్ల కోసం వీటిని కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. వీటి కోసం కొత్తగా ముందుకు వస్తున్న కొనుగోలుదారులు బహుళజాతిసంస్థలతో, ఐరోపా, అమెరికాలకు చెందిన అత్యంత సంపన్నులతోనూ పోటిపడుతున్నారని తెలిపారు. బుధవారం జరగనున్న వేలంలో ఒకింత చిన్న సైజుదిగా భావిస్తున్న (12.5 అడుగులు) అలోసౌరోస్‌కు దాదాపు రూ. 5.22 కోట్లు (ఆర్నునర లక్షల యూరోలు), పెద్ద ముక్కు నుంచి  తోక వరకు 12 మీటర్ల సైజు కలిగిన డిప్లోడొకస్‌కు దాదాపు రూ.4 కోట్ల వరకు (నాలుగున్నర నుంచి అయిదులక్షల యూరోలు ) రావొచ్చునని భావిస్తున్నారు. 

చికాగో మ్యూజియంలో డైనోసార్‌కు 8.6 మిలియన్‌ డాలర్లు...
1997లో మెక్‌డొనాల్డ్, వాల్ట్‌డిస్నీ సంస్థలతో సహా ఇతరుల విరాళాలు కలిపి దాదాపు రూ.55.86 కోట్ల (8.36 మిలియన్‌ డాలర్ల ) తో  పూర్తిస్థాయిలోని ‘టెరన్నోసారస్‌’ అస్థిపంజరాన్ని కొనుగోలు చేసి చికాగోలోని నేషనల్‌ హిస్టరీ మ్యూజియంలో ఉంచారు. దీనిని చూసేందుకు లక్షలాది మంది వస్తుండడంతో ఈ కంపెనీలకు మంచి పబ్లిసిటీ వస్తోందని  ఓ కొనుగోలు కేంద్ర నిపుణుడు ఎరిక్‌ మికీలర్‌ చెప్పారు. వీటిని తమ కలెక్షన్లలో పెట్టుకోవాలని అనుకుంటున్న వారిలో వాటి పళ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారన్నారు.జురాసిక్‌ కాలాని కంటే పూర్వపు ౖ‘టెరన్నోసారస్‌’ డైనోసార్‌ అరుదైన పుర్రెను 2007లో నికోలాస్‌ కేజ్‌ కొనుగోలు చేసినా మంగోలియా నుంచి దానిని దొంగిలించి తీసుకొచ్చారని తెలియడంతో తిరిగి అప్పగించేశాడు. ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అయిదు డైనోసార్ల అస్థిపంజరాలను వేలానికి పెడుతున్నారు.ట్రియాసిక్‌ నుంచి క్రెటాషీయస్‌ కాలం వరకు జీవించిన ‘దెరోపొడా’ డైనాసారో అస్థిపంజరం వచ్చేజూన్‌లో దాదాపు రూ.12.04 కోట్లకు (1.5 మిలియన్‌ యూరోలకు) వేలం నిర్వహించనున్నారు. 
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

మరిన్ని వార్తలు