చర్చలు జరుగుతున్నాయి

22 Dec, 2013 01:39 IST|Sakshi

 ‘దేవయాని ఉదంతం పరిష్కారం’పై భారత్, అమెరికాల ప్రకటన

అమెరికాలో భారత సీనియర్ దౌత్యవేత్త  దేవయాని ఖోబ్రగడే అరెస్ట్‌పై అమెరికా, భారత్‌ల మధ్య తలెత్తిన వివాదం పరిష్కారం దిశగా కదుల్తోంది. దౌత్యపరమైన, ప్రైవేటు మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని రెండు దేశాలు శనివారం ప్రకటించాయి. ద్వైపాక్షిక సంబంధాలు తమకు అత్యంత విలువైనవని స్పష్టం చేశాయి. వివాద పరిష్కార యత్నాల్లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెరీ త్వరలో భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు ఫోన్ చేయాలనుకుంటున్నారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ సాకి వెల్లడించారు. సమస్య పరిష్కారం కోసం వివిధ స్థాయిల్లో చర్చలు కొనసాగుతున్నాయని సల్మాన్ ఖుర్షీద్ కూడా తెలిపారు.

సామరస్య పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మా దౌత్యవేత్తకు మీ దగ్గర గౌరవమర్యాదలు లభించాలని మేం ఆశించడం అసంబద్ధమవుతుందా?’ అని అమెరికాను ఆయన ప్రశ్నించారు. మరోవైపు,  దేవయానిని ఐక్యరాజ్య సమితి శాశ్వత మిషన్‌కు బదిలీ చేయడం వల్ల ఆమెకు లభించిన సంపూర్ణ దౌత్య రక్షణ గతకాలానికి వర్తించదని, ఆ రక్షణ ప్రస్తుత స్థాయి నుంచే అమల్లోకి వస్తుందని అమెరికా స్పష్టం చేసింది. పరిమితమైన దౌత్య రక్షణ లభించే డెప్యూటీ కాన్సుల్ జనరల్ హోదా నుంచి సంపూర్ణ దౌత్య రక్షణ లభించే ఐరాస మిషన్‌కు బదిలీ కావడం వల్ల ఆమెపై ఉన్న గత కేసులన్నీ మాయమైపోవని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ సాకి వ్యాఖ్యానించారు.

 ఆమె సీఐఏ ఏజెంట్:  దేవయాని తండ్రి ఆరోపణ

 వివాదానికంతటికీ కారణమైన పనిమనిషి సంగీత రిచర్డ్స్ అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఏజెంట్ అయ్యుండొచ్చని దేవయాని తండ్రి ఉత్తమ్ ఖొబ్రగడే శనివారం ఆరోపించారు. కుట్రలో భాగంగానే తన కూతురిని బలిపశువును చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. దేవయానిపై కేసులను ఉపసంహరించుకుంటేనే తమకు న్యాయం లభిస్తుందన్నారు.
 

మరిన్ని వార్తలు