'ఉగ్రవాదం పాక్‌ డీఎన్‌ఏలోనే ఉంది'

15 Nov, 2019 12:42 IST|Sakshi

పారిస్‌ : కశ్మీర్‌ విషయంలో రాజకీయాలు చేయాలని చూస్తున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ వేదికలపై  భారత్‌ దీటుగా సమాధానం చెబుతుంది. తాజాగా ప్యారిస్‌లో జరుగుతున్న యూనెస్కో జనరల్‌ సమావేశంలో పాక్‌ లేవనెత్తిన కశ్మీర్‌ అంశాన్ని భారత్‌ తిప్పికొట్టింది. ఉగ్రవాదం అనేది పాక్‌ డీఎన్‌ఏలోనే ఉందంటూ భారత్‌ తరపున హాజరైన అనన్య అగర్వాల్‌ స్పష్టం చేశారు. పాక్‌ అనుసరిస్తున్న విధానాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్తను దారుణంగా కుంగదీశాయన్నారు. యూనెస్కో వేదికగా భారత్‌పై బురద జల్లేందుకు ప్రయతించిన పాక్‌ వైఖరిని ఆమె ఖండించారు.  ఉగ్రవాద సిద్ధాంతాలు, తీవ్రవాద భావజాలం వంటి చీకటి కోణాలకు పాక్‌ అడ్డాగా మారందని అగర్వాల్‌ ఆరోపించారు. 

అణు యుద్దం, ఇతర దేశాలపై ఆయుధాలను ప్రయోగించడం లాంటి వ్యాఖ్యలు చేసి ఐక్యరాజ్యసమితి వేదికను అవమానించడం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదులుగా పేరు మోసిన ఒసామా బిన్‌ లాడెన్‌, హక్కానీ నెట్‌వర్క్‌ లాంటి వారిని పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ పాకిస్తాన్‌ హీరోలుగా అభివర్ణించడాన్ని చూస్తేనే వారి నిజం స్వరూపం బయటపడిందని పేర్కొన్నారు.అలాగే పాక్‌ మైనారిటీ వర్గాలు, మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. మళ్లీ పాక్‌ ఇటువంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదని అనన్య తేల్చి చెప్పారు.     

>
మరిన్ని వార్తలు