తొలి ఆంగ్లేయుడు శ్వేతజాతీయుడు కాదా..?

7 Feb, 2018 10:16 IST|Sakshi

లండన్‌ : పురాతన బ్రిటిషర్లు శ్వేతజాతీయులు కాదని డీఎన్‌ఏ పరీక్షల ద్వారా తేలింది. పదివేల సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తి ఎముకలపై తొలిసారిగా నిర్వహించిన అత్యంతాధునిక జన్యు పరీక్షలు, ఫేషియల్‌ రీకన్‌స్ర్టక్షన్‌ టెక్నిక్స్‌ ద్వారా అసాధారణ విషయాలు వెలుగుచూశాయి. తొలితరం ఆంగ్లేయులు నలుపు వర్ణంతో, ఉంగరాల జుట్టు, నీలి కళ్లు కలిగిఉన్నారని తెలిసింది.

బ్రిటన్‌లోని సోమర్సెట్‌ చెద్దార్‌ లోయలో లభించిన అతిపురాతన మానవ కళేబరంపై పరీక్షలు నిర్వహించిన శాస్త్రవేత్తలు విస్తుగొలిపే అంశాలను వెల్లడించారు. తాము పరిశీలించిన మానవ కళేబరం జీవించి ఉంటే సదరు వ్యక్తి ‘బ్లాక్‌’  అని స్పష్టం చేశారు. ఆంగ్లేయులు శ్వేతజాతీయులు కాదని, కాలక్రమేణా వారి చర్మం వర్ణం మారిఉండవచ్చని తమ పరిశోధనలో తేలినట్టు వారు పేర్కొన్నారు.

1903లో సోమర్సెట్‌లోని చెద్దార్‌లో లభించిన కళేబరం, వాటి ఎముకలు అప్పటి నుంచి సంచలనంగానే మారాయి. వందేళ్లకు పైగా శాస్త్రవేత్తలు ‘చెద్దార్‌ మెన్‌’ కథను వెలికితీసే పనిలో పడ్డారు. అతని ముఖకవళికలు, పూర్వాపరాలు, తన పూర్వీకుల గురించి ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయనేది ఎప్పటికప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. నేచురల్‌ హిస్టరీ మ్యూజియం, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ నిర్వహించిన జన్యు పరీక్షల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయని మ్యూజియం శాస్త్రవేత్త డాక్టర్‌ టామ్‌ బూత్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు