4 నెలలుగా కరోనాతో పోరాటం.. వైద్యుడి మృతి

3 Jun, 2020 08:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీజింగ్‌: కరోనా వైరస్‌ గురించి ప్రపంచాన్ని హెచ్చరించిన కంటి వైద్యుడు లి వెన్లియాంగ్‌తో కలిసి వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రిలో పని చేసిన మరో  వైద్యుడు హు వైఫెంగ్ మంగళవారం కోవిడ్‌-19తో మరణించారు. ఈ విషయాన్ని చైనా జాతీయ మీడియా వెల్లడించింది. వుహాన్ సెంట్రల్ హాస్పిటల్‌లో యూరాలజిస్ట్‌గా పని చేస్తున్న హు వైఫెంగ్ నాలుగు నెలల నుంచి కరోనా, ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. గత ఏడాది చివర్లో సెంట్రల్ చైనా నగరంలో ఉద్భవించిన ఈ వైరస్ కారణంగా వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రిలో మరణించిన ఆరవ వైద్యుడు హు వైఫెంగ్. కాలేయం దెబ్బతినడం వల్ల అతని చర్మం నల్లగా మారిందని కొన్ని నెలల క్రితం చైనా మీడియా ప్రచారం చేయడంతో హు పరిస్థితి పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. (పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి: చైనా)

మరో వైద్యుడు యి ఫ్యాన్‌లో కూడా ఇలాంటి లక్షణాలు బయటపడ్డాయి. కాని ఆయన కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. హు మరణంపై వుహాన్ సెంట్రల్ హాస్పిటల్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫిబ్రవరి ఆరంభంలో 68 మంది వుహాన్‌ ఆస్పత్రి సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారని చైనా మీడియా తెలిపింది. ఫిబ్రవరిలో లి వెన్లియాంగ్ తన చివరి రోజులను డాక్యుమెంట్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రభుత్వం ఆయనను దేశద్రోహిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. లి డిసెంబర్ చివరలోనే వైరస్ గురించి తన సహచరులను హెచ్చరించడంతో అధికారులు అతడిని తీవ్రంగా మందలించారు. (మా వ్యాక్సిన్‌ 99% పని చేస్తుంది)

కోవిడ్‌-19 వల్ల చనిపోయిన వైద్య సిబ్బంది మరణాల పూర్తి సంఖ్యను చైనా ఇంకా విడుదల చేయలేదు. కాని కనీసం 34 మంది వైద్యులు కరోనా కారణంగా మరణించినట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి నుంచి చైనాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 1.4 బిలియన్ల జనాభా ఉన్న దేశంలో అధికారిక మరణాల సంఖ్య 4,634 మాత్రమే. చైనా కన్నా తక్కువ జనాభా ఉన్న దేశాలలో నమోదయిన కేసులు, మరణాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు