చనిపోయాడని చెప్పారు.. కానీ!

4 Jul, 2018 09:14 IST|Sakshi

కేప్‌టౌన్‌(దక్షిణాఫ్రికా) : ఆ రోజు జూన్‌ 24, తెల్లవారు జామున.. రోడ్డు సరిగా కనిపించడం లేదు. అసలే అది కేప్‌టౌన్‌లోకెల్లా చాలా ప్రమాదకరమయిన రోడ్డు. ఆ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్‌ జరిగింది. కారులో నలుగురులో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఎంత తీవ్రంగా అంటే కారులో నుంచి రోడ్డు మీద పడ్డారు. నాల్గో వ్యక్తికి మాత్రం అంత పెద్ద దెబ్బలేం తగల్లేదు. దాంతో అతను సాయం కోసం ఎదురు చూస చూస్తుండగా.. సమాచారం అందుకున్న ప్రైవేటు అంబులెన్స్‌ సర్వీస్‌ వారు అక్కడికి వచ్చారు.

గాయపడిన నాల్గో వ్యక్తిని కాపాడటం కోసం ఆస్పత్రికి తరలించారు. మిగతా ముగ్గురిని పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. అనంతరం వారిని మార్చురికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ముగ్గురిని స్ట్రెచర్‌ మీద పడుకోబెట్టి తీసుకెళ్తుండగా చనిపోయిన వారిలో ఒక వ్యక్తి శ్వాస తీసుకుంటున్నట్టు గమనించారు. అతన్ని పరీక్షించగా బతికే ఉన్నాడు. కొద్ది నిమిషాల ముందు మరణించాడని ప్రకటించిన వ్యక్తి మళ్లీ ఎలా బతికాడు...?  ఇలాంటి సంఘటనలు ఇక్కడే కాదు ప్రంపంచ వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి బీబీసీ కొన్ని కథనాలను కూడా ప్రచారం చేసింది.

వాటిలో గత జనవరిలో గోన్జాలో మొన్టోయో అని వ్యక్తి మరణించినట్లు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు డాక్టర్లు నిర్ధారించారు. అతనికి పోస్టు మార్టమ్‌ చేద్దామని శరీరంపై గుర్తులు కూడా పెట్టారు. కానీ ఉన్నట్టుండి ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. మూడేళ్ల క్రితం 91 ఏళ్ల వృద్ధురాలిని మరణించినట్లు ప్రకటించారు. కానీ ఆమె మరణించినట్లు ప్రకటించిన 11 గంటల తర్వాత ఆ బామ్మ నింపాదిగా లేచి కూర్చుని వేడి వేడిగా ఓ కప్పు కాఫీ, పాన్‌ కేక్‌ తీసుకురమ్మని డాక్టర్లకు చెప్పింది. దాంతో డాక్టర్లు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. ​

కొన్నేళ్ల క్రితం ఓ 80 ఏళ్ల బామ్మకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు ఆమెను మరణించిందని నిర్ధారించి, ఫ్రీజర్‌లో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆమె ముక్కు పగిలి సగం బయటకు వచ్చి ఉంది. ఏం జరిగిందో ముందు డాక్టర్లకు అర్థం కాలేదు. తర్వాత తెలిసిందేంటంటే పాపం ఆ వృద్ధురాలిని ఫ్రీజర్‌లో పెట్టిన తర్వాత బతికిందని, అందుకే బయటకు రావడానికి ప్రయత్నించి ఉంటుందని తెలిపారు డాక్టర్లు.

మరణం తర్వాత జీవం ఎలా...
వైద్యులు పరీక్షించి, మరణించారని నిర్ధారించిన తర్వాత కూడా వీరంతా మళ్లీ ఎలా బతుకుతున్నారన్నదే చాలా ఆశ్చర్చకరమైన విషయం. అయితే దీనికి వైద్యులు చెప్పే సమాధానం మరణించారని నిర్ధారించిన వ్యక్తులు కొన్నిసార్లు నిజంగానే మరణించరు. ఆ సమయంలో వారు ‘కాటలాప్సి’(కండరాలు బిగుసుకుపోవడం) అనే స్థితికి చేరుకుంటారు. ఆ సమయంలో వారి హృదయ స్పందనలు, శ్వాస తీసుకోవడం వంటి వాటిని గుర్తించలేనంత లో-లెవల్‌కు పడిపోతాయి. కాబట్టి వారు మరణించిన వారిలానే ఉంటారు. కండరాల బిగువు సడలిన తర్వాత వారి శరీరం సాధారణ స్థితిలోకి వచ్చి ఉన్నట్టుండి ఒక్కసారిగా బతుకుతున్నారని తెలిపారు వైద్యులు.

మరిన్ని వార్తలు