ఇక్కడ గ్రహాంతరవాసులు ఉండొచ్చు..!

16 Apr, 2017 16:57 IST|Sakshi
ఇక్కడ గ్రహాంతరవాసులు ఉండొచ్చు..!

మనం నివసిస్తున్న భూమికి ఓ చంద్రుడు ఉన్నట్లే.. శనిగ్రహానికీ ఎన్ సెలాడస్‌ అనే ఒక చంద్రుడు ఉన్నాడు. దానిమీద నీళ్లు ఉన్నట్లు కూడా తేలింది. ఇప్పుడు ఆ చంద్రుడి మీద గ్రహాంతరవాసులు ఉండే అవకాశం కచ్చితంగా ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చెబుతోంది. ఎన్ సెలాడస్‌ మీద ఉన్న మంచు కింద నీళ్లు ఉన్నట్లు గుర్తించింది. అక్కడి నమూనాలను సేకరించి పరిశీలించగా, అందులో 98 శాతం నీళ్లు ఉన్నట్లు తేలింది. మిగిలిన 2 శాతం కూడా హైడ్రోజన్ , కార్బన్ డయాక్సైడ్, మీథేన్  లాంటి వాయువులు ఉన్నాయని చెప్పారు.

వీటన్నింటిని బట్టి చూస్తే అక్కడ జీవం ఉందని తెలుస్తోందని పరిశోధనలకు నేతృత్వం వహించిన సౌత్‌వెస్ట్‌ రీసెర్చ్‌ఇన్ స్టిట్యూట్‌ శాస్త్రవేత్త హంటర్‌ వైట్‌ తెలిపారు. బహుశా తాము మళ్లీ అక్కడకు వెళ్లి జీవానికి సంబంధించిన ఆనవాళ్లనూ చూడాల్సి ఉందని చెప్పారు. అసలు వేరే గ్రహం మీద జీవాన్ని కనుక్కోవడమే చాలా ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. వాస్తవానికి మన చంద్రుడితో పోలిస్తే ఎన్ సెలాడస్‌ చాలా చిన్నది. చంద్రుడిలో సుమారు 15 శాతం పరిమాణంలో మాత్రమే ఉండే ఎన్ సెలాడస్‌ మీద జీవానికి కావల్సిన రసాయన ఇంధనం ఉందన్న నిర్ధారణ భూగ్రహానికి వెలుపల జీవం మీద జరుగుతున్న పరిశోధనలో మైలురాయి అని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు