థాంక్యూ రుస్తుం..!

1 Oct, 2015 13:22 IST|Sakshi
థాంక్యూ రుస్తుం..!

మ్యాన్హోల్లో చిక్కుకుపోయిన వీధికుక్కను ఓ పాదచారి కాపాడిన వైనం ఫేస్బుక్లో కొన్ని లక్షల లైకులను కొట్టేసింది. రష్యాలోని వరోని నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన  వాదిమ్ రుస్తుం దారిన వేగంగా వెళ్తుండగా.. నిస్సహాయంగా అరుస్తున్న కుక్క అరుపులు వినిపించాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ముందు అర్థం కాలేదు. శ్రద్ధగా విన్న తర్వాత తను నడుస్తున్న పేవ్మెంట్ అడుగు నుంచి ఆ అరుపులు వస్తున్నాయని గమనించాడు.

హృదయవిదారకంగా ఉన్న ఆ కుక్క అరుపులు విన్నాక దాన్ని ఎలాగైనా రక్షించాలనుకున్న రుస్తుం.. సిటీ అధికారులను సంప్రదించాడు. కానీ, వాళ్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక తానే స్వయంగా రంగంలోకి దిగాడు.  మ్యాన్హోల్ను జాగ్రత్తగా తెరిచి, కుక్కను బయటకు తీశాడు. దీంతో రెండు రోజులపాటు బందీగా ఉన్న ఆ కుక్క.. హాయిగా తోక ఊపుకుంటూ వెళ్లిపోయింది. అన్నట్టు ఈ కుక్క ప్రెగ్నెంట్ అట. కుక్క అదృష్టమో లేక దాని కడుపులో ఉన్న బుజ్జి కుక్కపిల్లల అదృష్టమో గానీ రెండు రోజులు తర్వాత క్షేమంగా బతికి బయటపడిందా శునకమాత. రుస్తుం ఈ వీడియోను  ఫేస్బుక్లో షేర్ చేశాడు. అది విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

సదరు కుక్కమాత చిక్కుకుపోయిన ఆ మ్యాన్హోల్ గత మూడు వారాలుగా తెరిచి ఉందట. సెప్టెంబర్ 18న హౌసింగ్ అధికారులు లోపల  చిక్కుకుపోయిన కుక్కను గమనించకుండానే దాన్ని మూసేనట్టు సమాచారం.

మరిన్ని వార్తలు