ఏడాదికి డాలరు జీతం చాలు

15 Nov, 2016 01:53 IST|Sakshi
ఏడాదికి డాలరు జీతం చాలు

ట్రంప్ వెల్లడి
 
 వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల ప్రచారంలో చెప్పిన దాని ప్రకారం ఏడాదికి ఒక్క డాలరు జీతం మాత్రమే తీసుకుంటానని పునరుద్ఘాటించారు. సాధారణంగా అధ్యక్షుడికి ఇచ్చే నాలుగు లక్షల డాలర్లను స్వీకరించననీ, సెలవులపై ఎలాంటి విహారయాత్రలకు వెళ్లనని చెప్పారు. పన్నులను తగ్గిస్తాననీ, ఆరోగ్య సంరక్షణ రంగంపై శ్రద్ధ పెడతానని ప్రకటించారు. ప్రస్తుత  అధ్యక్షుడు ఒబామా హస్య చతురత ఉన్న మనిషి అనీ, అలాగే ప్రచండుడు కూడా అని ట్రంప్ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత గురువారం శ్వేతసౌధంలో అధ్యక్షుడి అధికారిక కార్యాలయం ఓవల్ ఆఫీసులో ఒబామా ట్రంప్‌ను కలవడం తెలిసిందే. ఎన్నికల సమయంలో తమ మధ్య ఉన్న వైరం గురించి భేటీలో అసలేమీ మాట్లాడలేదని ట్రంప్ తెలిపారు.

మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సోమవారం ట్రంప్‌తో మాట్లాడారు. ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలపడంతోపాటు చైనా, అమెరికాల బంధం బలపడటానికి సహకారమే సరైన మార్గమని  అన్నారు. ఎఫ్‌బీఐ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తన ప్రత్యర్థి హిల్లరీకి వ్యతిరేకంగా ప్రత్యేక న్యాయవాదిని నియమించే అంశంపై ఇంకా ఏమీ ఆలోచించలేదనీ, ప్రస్తుతం ఉద్యోగాల కల్పన, ఆరోగ్యం, వలసలు వంటి వాటిపై దృష్టి పెడుతున్నానని ట్రంప్ చెప్పారు. అలాగే రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్మన్ రీన్‌‌స ప్రీబస్, ఎన్నికల్లో ట్రంప్ ప్రచార బృందం సీఈవో స్టీఫెన్ బ్యానన్‌లను ట్రంప్ వైట్‌హౌస్‌లో కీలక స్థానాల్లో నియమించారు. ప్రీబస్‌కు ఉద్యోగుల అధిపతిగా, బ్యానన్‌కు ముఖ్య వ్యూహకర్తగా స్థానాలు లభించారుు.

 ముస్లింలపై వేధింపులు బాధపెడుతున్నాయి
  ముస్లింలు, లాటిన్లు, ఆఫ్రికన్-అమెరికన్లపై వేధింపులు ఆపాలని ట్రంప్ తొలిసారిగా ప్రజలను కోరారు. తాను అధ్యక్షుడు అయ్యాక వేధింపులు మొదలయ్యాయన్న వార్తలు తనకు బాధ కలిగిస్తున్నాయని అన్నారు.
 
 హిట్లర్‌తో పోల్చినందుకు ఉద్వాసన
 ట్రంప్‌ను నియంత హిట్లర్‌తో పోల్చినందుకు కాలిఫోర్నియాలో ఒక ప్రొఫెసర్‌ను తాత్కాలికంగా తొలగించారు. చరిత్ర, ప్రత్యేక విద్యను బోధించడంలో అపార అనుభవం ఉన్న ఫ్రాంక్ నవరో (65) అనే ప్రొఫెసర్, ఎన్నికలు పూర్తైన తర్వాత పాఠం చెబుతూ ట్రంప్‌ను హిట్లర్‌తో పోల్చారు.

మరిన్ని వార్తలు