అంతా మోసాల ప్రపంచమే

16 Oct, 2018 04:06 IST|Sakshi

అధ్యక్ష పదవి, అధికారంపై ట్రంప్‌ వ్యాఖ్య

అధ్యక్ష ఎన్నికల్లో చైనా కూడా జోక్యం చేసుకుందని ఆరోపణ

వాషింగ్టన్‌: అధ్యక్ష పదవి, అధికారం అంటే అబద్ధాలతో నిండిపోయిన, మోసపూరిత, ప్రమాదకర ప్రపంచమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. తాను స్థిరాస్తి వ్యాపార రంగంలో ఉన్నప్పుడు మన్‌హట్టన్‌లో అదే రంగంలో పనిచేసే మనుషులు ఘటికులని అనుకునే వాడిననీ, కానీ రాజకీయ నాయకుల ముందు వారు పసిపిల్లల వంటి వారని ట్రంప్‌ అన్నారు. అధ్యక్ష భవనం శ్వేతసౌధానికి వచ్చి 20 నెలలు పూర్తయిన సందర్భంగా సీబీఎస్‌ న్యూస్‌ చానల్‌కు ట్రంప్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. మీడియాకు అస్సలు నిజాయితీ ఉండదన్న విషయం అధ్యక్షుడినయ్యాకే తెల్సుకున్నానన్నా రు.

‘గతంలో ఎవ్వరూ చేయని పనులను నేను చేయగలుగుతున్నా. పన్నుల విషయంలో కావచ్చు, నిబంధనలు కావచ్చు, ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం కావచ్చు. నాలా ఎవ్వరూ చేయలేదు’ అని అన్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వివిధ వర్గాలుగా విడిపోయిన వారిని ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ దగ్గర చేస్తోందన్నారు. యూఎస్‌ సుప్రీంకోర్టు జడ్జిగా కేవనాను నియమించడంతో మొదలైన వివాదం.. వచ్చే నెలలో మధ్యంతర ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేశారు. తన పాలనలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నవి నకిలీ వార్తలేనని ఆయన చెప్పారు. వైట్‌హౌస్‌లోని అందరినీ నమ్మననీ, ఈ పదవిలో ఉండటం కష్టమైన పనని చెప్పారు.

వలస చట్టాలన్నీ మార్చాలి..
అమెరికాలోని ప్రస్తుత వలస చట్టాలను చూసి ప్రపంచం నవ్వుతోందనీ, ఈ చట్టాలన్నింటినీ మార్చాలన్నారు. ప్రతిభ ఉన్న వారిని అమెరికాలోకి అనుమతించే విధానం తెస్తామని ట్రంప్‌ శనివారం కూడా చెప్పారు. ఇటీవల సరిహద్దుల్లోనే అక్రమ వలసదారులను పట్టుకుని పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం తెలిసిందే. ఈ విధానాన్ని మళ్లీ అమలు చేస్తారా అని ప్రశ్నించగా, అన్ని వలస చట్టాలనూ తాను మారుస్తానని ట్రంప్‌ వెల్లడించారు. అక్రమ వలసదారులు అమెరికాలో అన్ని సౌకర్యాలు పొందేలా చేసే ఓ విధానాన్ని డెమొక్రాట్లు సమర్థిస్తున్నారని ఆరోపించారు. అక్రమ వలసదారుల వల్లే దేశంలో నేర ముఠాలు పెరిగిపోతున్నాయన్నారు.

పర్యావరణ మార్పు అనేది ఓ మిథ్య అని గతంలో అన్న ట్రంప్‌ తాజాగా తన మాటమార్చారు. పర్యావరణం వేడెక్కుతుండటం నిజమే కానీ, వాతావరణ మార్పు శాస్త్రవేత్తలకు రాజకీయ ఎజెండాగా ఉందని ఆరోపణలు చేశారు.   మధ్యంతర ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ ‘రష్యా వాళ్ల జోక్యం ఉంది. కానీ చైనా జోక్యమూ ఉందని నాకనిపిస్తోంది. చైనా మరో పెద్ద సమస్య’ అని అన్నారు. కాగా, దక్షిణాఫ్రికాకు చెందిన కమెడియన్, ‘ద డైలీ షో’ యాంకర్‌ ట్రెవొర్‌ నోవా ట్రంప్‌ను కేన్సర్‌ జబ్బుతో పోల్చారు.
 

మరిన్ని వార్తలు