ట్రంప్‌ అత్యాచారం చేశారు

23 Jun, 2019 05:04 IST|Sakshi
డొనాల్డ్‌ ట్రంప్‌, ఈ జీన్‌ కరోల్‌

మరో రచయిత్రి ఆరోపణ

తోసిపుచ్చిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్తగా ఉన్న సమయంలో అమ్మాయిలతో వ్యవహారాలు చాలా నడిపాడని, లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఇప్పటికే చాలా ఉన్నాయి. తాజాగా రచయిత్రి ఈ జీన్‌ కరోల్‌ కూడా 1995 సమయంలో ట్రంప్‌ తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆమె తన జీవితంలోని అనుభవాల్ని న్యూయార్క్‌ మ్యాగ్‌జైన్‌ కవర్‌ స్టోరీలో రాస్తూ ఈ ఆరోపణలు చేశారు. మన్‌హట్టన్‌లో బెర్గ్‌డోర్ఫ్‌ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో తనను కలిసిన ట్రంప్‌ గర్ల్‌ ఫ్రెండ్‌కి ఒక గౌను కొన్నానని, అది వేసుకొని చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందంటూ కోరారని వెల్లడించారు.

అందుకు అంగీకరించి డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లగా ట్రంప్‌ తనపై అత్యాచారం చేశారని పేర్కొన్నారు. కరోల్‌ తాను రాసిన కొత్త పుస్తకం వాట్‌ డూ వి నీడ్‌ మెన్‌ ఫర్‌ పుస్తకం నుంచి కొన్ని భాగాలతో ఈ కథనం రాశారు. ఈ పుస్తకం విడుదల కావల్సింది. ఈ కథనంపై ట్రంప్‌ స్పందించారు. అసలు కరోల్‌ని తన జీవితంలో ఎప్పుడూ కలవలేదని ట్రంప్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.  కరోల్‌ తన పుస్తకం అమ్మకాలు పెంచుకోవడానికే ఈ కట్టు కథ అల్లి వదిలిందన్నారు. ఆధారాలు లేకుండా న్యూయార్క్‌ మ్యాగజైన్‌ ఇలాంటి కథనాన్ని ఎలా ప్రచురిస్తుందని నిలదీశారు. అంత పెద్ద స్టోర్‌లో కెమెరాలు ఉండవా? సేల్స్‌ అటెండర్స్‌ ఉంటారు కదా? డ్రెస్సింగ్‌ రూమ్‌లో అత్యాచారం  ఎలా సాధ్యం ? బెర్గ్‌దోర్ఫ్‌ గుడ్‌మ్యాన్‌ స్టోర్‌ వాళ్లు ఎలాంటి వీడియోలు లేవని ధ్రువీకరించారు. ఎందుకు లేవంటే అలాంటి ఘటనే జరగలేదని ఆ ప్రకటనలో వెల్లడించారు. ట్రంప్‌ అధికారం పీఠం ఎక్కిన దగ్గర్నుంచి కనీసం 20 మంది మహిళలు ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు.

మరిన్ని వార్తలు