అణు పరీక్ష ప్రయత్నాల్లో అమెరికా

24 May, 2020 04:18 IST|Sakshi

1992 తర్వాత ఇదే మొదటిసారి  రష్యా, చైనాలకు తీవ్ర హెచ్చరికలు పంపడమే లక్ష్యం

వాషింగ్టన్‌: దాదాపు 28 ఏళ్ల తర్వాత అమెరికా మరోసారి అణు పరీక్ష జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రష్యా, చైనాలకు గట్టి హెచ్చరికలు పంపడమే దీని లక్ష్యమని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’తన కథనంలో పేర్కొంది. అణు పరీక్ష నిర్వహించడంపై 15న∙ప్రభుత్వ యంత్రాంగం చర్చించింది. చర్చల్లో అంతిమ నిర్ణయం తీసుకోలేదు. ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నదీ లేనిదీ వెల్లడి కాలేదని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రభుత్వంలోని ఓ అధికారి, ఇద్దరు మాజీ అధికారులు వెల్లడించారని ఆ కథనంలో పేర్కొంది.

ర్యాపిడ్‌ టెస్ట్‌తో తన సామర్థ్యాన్ని ప్రదర్శించుకోవడం ద్వారా రష్యా, చైనాలను అమెరికా తన దారికి తీసుకువచ్చి అణ్వాయుధాలకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు అన్నారు. అయితే, ఈ చర్య ద్వారా తన రక్షణ విధానం నుంచి అమెరికా వైదొలిగినట్లే అవుతుందని, ప్రపంచ దేశాల మధ్య తీవ్ర అణ్వాయుధ పోటీకి దారి తీస్తుందని పరిశీలకులు అంటున్నారు. ‘అణ్వాయుధ పోటీని నివారించే ఉద్యమానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ప్రపంచ దేశాల మధ్య ఆయుధ పోటీకి తెరలేస్తుంది.

ముఖ్యంగా ఉత్తర కొరియాతో అణు చర్చలకు ఆటంకం కలుగుతుంది. అణు పరీక్షలపై విధించిన మారటోరియంకు ఆ దేశ పాలకుడు కిమ్‌ కట్టుబడి ఉండకపోవచ్చు. అంతిమంగా, అమెరికా చర్య కొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీస్తుంది’అని ఆర్మ్స్‌ కంట్రోల్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డారిల్‌ కింబల్‌ అన్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక అమెరికా రక్షణ విధానం పెనుమార్పులకు లోనయింది. రష్యా, చైనాలు తక్కువ తీవ్రత గల అణు పాటవ పరీక్షలు జరుపుతున్నాయంటూ అమెరికా గతంలో ఆరోపణలు చేసింది. వీటిని ఆయా దేశాలు ఖండించాయి కూడా. చివరిసారిగా అమెరికా 1992లో అణు పరీక్ష నిర్వహించింది.

>
మరిన్ని వార్తలు