నేను మాస్క్‌ పెట్టుకోను: ట్రంప్‌

4 Apr, 2020 11:48 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముఖానికి మాస్క్‌లు ధరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు. తాను మాత్రం మాస్క్‌లు ధరించనని తెలిపారు.  శుక్రవారం విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ మాస్క్‌లు ధరించినా.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా మహమ్మారి కట్టడికి సామాజిక దూరం పాటించడం అనేది అత్యవసరమని తెలిపారు. మాస్క్‌లు ధరించడం, ధరించకపోవడం అనేది వ్యక్తిగతమైన విషయమని, తాను మాత్రం ముఖానికి మాస్క్‌ ధరించకూడదని నిర్ణయించుకున్నానని ట్రంప్‌ తెలిపారు. అయితే ఎందుకు మాస్క్‌ ధరించడం లేదని ట్రంప్‌ని ప్రశ్నించగా తాను అనేక దేశాల అధ్యక్షులను, ప్రధానులను, ఉన్నతాధికారులను, రాజులను, రాణులను కలుస్తూ ఉంటానని ఆ సమయంలో మాస్క్‌లతో వారిని కలవడం ఇష్టం లేదని వివరించారు. (24 గంటల్లో 1500 మంది మృతి)

 ఇదిలా ఉండగా విదేశాలకు యన్‌-95 మాస్క్‌లను, ఇతర రక్షణ పరికరాలను విదేశాలకు  ఎగుమతి చేయడం ఆపివేయాలని ట్రంప్‌ అధికారులను ఆదేశించారు. కరోనా మహమ్మారితో పోరాడటానికి వాటి అవసరం ఎంతో ఉందని దేశంలో కొరత ఏర్పడకుండా ఉండటానికి వాటి ఎగుమతులను ఆపివేయాలని ఆదేశించారు. డిఫెన్స్‌ ప్రొడక‌్షన్‌ యాక్ట్‌ అనేది ధరలు తగ్గించడానికి, అధిక లాభార్జన కోసం అత్యవసరమైన రక్షణ పరికరాలను  విదేశాలకు ఎగుమతి చేయడం లాంటి వాటి అరికట్టే చర్యల్లో భాగమని పేర్కొన్నారు.

ఈ విషయంపై వైట్‌హౌస్‌ వ్యాపార సలహాదారు పీటర్‌ నవ్వర్రో మాట్లాడుతూ.. కొంత మంది బ్లాక్‌ మార్కెట్ల ద్వారా దేశీయ అవసరాలు పట్టించుకోకుండా లాభార్జన కోసం విదేశాలకు మాస్క్‌లను ఇతర రక్షణ పరికరాలను సరఫరా చేస్తున్నారన్నారు. అయితే మాస్క్‌ల కొరత గురించి రాష్ట్ర గవర్నర్‌లు, ఆసుపత్రి సిబ్బంది ప్రశ్నించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇతర దేశాల్లో లాగా మాస్క్‌ల వాడకాన్ని కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం చెప్పకపోవడంతో నిపుణులు ఈ విషయం పై ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తుల్లో ఎక్కువ మందికి లక్షణాలు తక్కువగా ఉన్నాయని కానీ వారికి నెమ్మదిగా కరోనా లక్షణాలు పెరుగుతాయని  వారు దగ్గడం, తుమ్మడం, మాట్లడం ద్వారా ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని సర్జన్‌ జనరల్‌ జెరోమ్‌ ఆడమ్స్‌ అన్నారు. 

యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చాలా మందికి మెడికల్-గ్రేడ్ మాస్క్‌లను ఉపయోగించమని సిఫారసు చేయడం లేదని ట్రంప్ అన్నారు. అమెరికన్లు ఇంట్లో క్లాత్ మాస్క్‌లు తయారు చేయవచ్చని ఆయన అన్నారు. మహమ్మారిపై పోరాడటానికి అమెరికాకు ఎక్కువ యన్‌ 95 రెస్పిరేటరి మాస్క్‌లు అందిస్తామని 3 యమ్‌ కో శుక్రవారం తెలిపింది. అయితే ట్రంప్ నిర్దేశించిన విధంగా ఇతర దేశాలకు సరఫరాను పరిమితం చేస్తే వచ్చే మానవతా చిక్కులు గురించి ఆ సంస్థ హెచ్చరించారు. కాగా అమెరికా 2001, సెప్టెంబర్‌ 11న జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పొయిన వారి కంటే ఎక్కువ మంది న్యూయార్క్‌లో కరోనా వైరస్‌సోకి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి నాటికి అమెరికా వ్యాప్తంగా 30 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. ఏడువేలకు పైగా మరణాలు సంభవించాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు